Pakistan: మోదీని మాకిచ్చేస్తే బాగుండును... మా దేశాన్ని చక్కదిద్దుతాడు: పాక్ పౌరుడి వ్యాఖ్యలు వైరల్

Pakistan citizen wants Modi to rule his country for good

  • యూట్యూబర్ సనా అంజాద్ చేసిన ఇంటర్వ్యూ
  • మోదీని తమకిచ్చేయాలంటూ అల్లాని ప్రార్థిస్తున్న పాక్ పౌరుడు
  • మోదీ వస్తేనే పాక్ బాగుపడుతుందని వ్యాఖ్యలు
  • పాకిస్థాన్ లో ఏదీ కొనలేకపోతున్నామని ఆవేదన

పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ యూట్యూబర్, పాత్రికేయురాలు సనా అంజాద్ తాజాగా పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సనా అంజాద్ తన యూట్యూబ్ చానల్ కోసం పబ్లిక్ టాక్ చేపట్టగా, పాకిస్థాన్ పౌరుడొకరు షేబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఏకిపడేశాడు. అదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

అల్లా గనుక భారత ప్రధాని నరేంద్ర మోదీని తమకు ఇచ్చేస్తే పాకిస్థాన్ బాగుపడుతుందని పేర్కొన్నాడు. మాకు మోదీ ఒక్కడు చాలు.... నవాజ్ షరీఫ్ వద్దు, ఇమ్రాన్ ఖాన్ వద్దు, బేనజీర్ లు, ముషారఫ్ లు మాకొద్దు అని స్పష్టం చేశాడు. మోదీ గనుక పాకిస్థాన్ ను పరిపాలిస్తుంటే నిత్యావసరాలన్నీ అందుబాటు ధరలకే లభ్యమయ్యేవని ఆ పౌరుడు అభిప్రాయపడ్డాడు. 

భారతదేశానికి వెళ్లి తలదాచుకున్నా ఫర్వాలేదు... పాకిస్థాన్ లో మాత్రం ఉండొద్దు అనే నినాదం పాకిస్థాన్ లో ఊపందుకుంటున్న తరుణంలో సనా అంజాద్ ఈ కోణంలోనూ ఆ పౌరుడ్ని ప్రశ్నించారు. అందుకతడు బదులిస్తూ, తాను పాకిస్థాన్ లో పుట్టకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు, అసలు భారత్ నుంచి పాకిస్థాన్ విడిపోకుండా ఉంటే ఇంకా బాగుండేదని అన్నాడు. తాము భారతదేశంలో కలిసుంటే తమ పిల్లలకు ప్రతి పూట కడుపునిండా తిండి పెట్టుకోగలిగేవాళ్లమని చెప్పాడు. 

పాకిస్థాన్ రాజకీయనేతల కంటే మోదీ ఎంతో మేలని, ఇలాంటి సంక్షోభంలో తమకు మోదీ తప్ప మరో నేత వద్దని పేర్కొన్నాడు. దేశంలో దుష్ట శక్తులను మోదీ సమర్థంగా ఎదుర్కోగలరని వివరించాడు. భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగితే, మనం (పాకిస్థాన్) ఎక్కడాలేమంటూ విచారం వ్యక్తం చేశాడు. 

"ఈ సందర్భంగా సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడ్ని నేను కోరుకునేది ఒక్కటే... మోదీని మాకు ఇచ్చేయండి... మా దేశాన్ని మోదీ పరిపాలించేలా చేయండి" అంటూ కంటతడి పెట్టుకున్నాడు. పాకిస్థానీలు ఇకనైనా భారతీయులతో పోల్చుకోవడం ఆపేయాలని, భారత్ తో పోల్చుకునేంత స్థాయి కూడా పాకిస్థాన్ కు లేదని ఆ పౌరుడు అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News