Mohan Lal: మోహన్ లాల్ ను కొన్నేళ్లుగా వెంటాడుతున్న కేసు.. ఏమిటో తెలుసా?
- గతంలో మోహన్ లాల్ ఇంట్లో ఐటీ సోదాలు
- తనిఖీల్లో అలంకరణకు వాడిన ఏనుగు దంతాల గుర్తింపు
- చట్ట ప్రకారమే వాటిని తాను తీసుకున్నానంటున్న మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఓ వైపు మెయిన్ రోల్స్ చేస్తూనే, ప్రాధాన్యత ఉన్న ఇతర పాత్రలను కూడా పోషిస్తూ ఆయన చాలా బిజీగా ఉన్నారు. అగ్ర నటుడిగా కొనసాగుతున్న మోహన్ లాల్ ను ఓ కేసు చాలా ఏళ్లుగా వేధిస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆయన ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం దక్కడం లేదు.
మోహన్ లాల్ కు తలనొప్పిని తీసుకొస్తున్న కేసు ఏనుగు దంతాలకు సంబంధించినది. ఆయన ఇంట్లో అలంకరణకు వాడిన ఏనుగు దంతాలు ఉన్నాయి. గతంలో ఆయన ఇంట్లో ఐటీ రైడ్స్ జరిగాయి. ఆ సందర్భంగా ఏనుగు దంతాలను చూసిన అధికారులు ఆయనపై వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు.
చట్టానుసారమే వాటిని తాను తీసుకున్నానని ఆయన చెప్పినప్పటికీ విముక్తి కలగలేదు. మోహన్ లాల్ ను దోషిగా పెరుంబవూరు మేజిస్ట్రేట్ కోర్టు నిర్ధారించింది. ఈ తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేయగా... కేరళ హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. ఈ అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా మరోసారి విచారణ జరపాలని మేజిస్ట్రేట్ ను హైకోర్టు ఆదేశించింది. దీంతో, కథ మళ్లీ మొదటికి వచ్చింది.