TPCC President: కేటీఆర్ కు ఫార్ములా వన్ రేస్ పై ఉన్న శ్రద్ధ.. కుక్కల బెడదపై లేదా?: రేవంత్ రెడ్డి
- బాలుడి కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ తక్షణమే పరామర్శించాలని డిమాండ్
- ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరిన రేవంత్ రెడ్డి
- భూపాలపల్లిలో ఎమ్మెల్యే భూ ఆక్రమణలపై ఆరోపణలు
హైదరాబాద్ లోని అంబర్ పేట ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించడం పట్ల ప్రభుత్వ స్పందనను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్, వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామనడంపై విమర్శలు కురిపించారు. వారికి అసలు మెదడు ఉందా? అని ప్రశ్నించారు.
హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ కు ఫార్ములా వన్ రేస్ పట్ల ఉన్న శ్రద్ధ, నగరంలో కుక్కల బెడదను నివారించడంపై లేదా? అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రశ్నించారు. కుక్కలకు ఆకలి వేసి బాలుడిపై దాడి చేశాయన్న హైదరాబాద్ మేయర్ వ్యాఖ్యలను సైతం ఆయన తప్పుబట్టారు. బాధిత కుటుంబాన్ని మంత్రి కేటీఆర్ తక్షణమే పరామర్శించి ప్రభుత్వపరంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
పాదయాత్రకు ముందు ప్రసిద్ధ కోటంచ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని రేవంత్ రెడ్డి సందర్శించారు. భూపాలపల్లిలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని వ్యాఖ్యానించారు. పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పేదల భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై విచారణకు మంత్రి కేటీఆర్ ఆదేశించాలని డిమాండ్ చేశారు.