electric car: ఎలక్ట్రిక్ కారు కొంటున్నారా..? ముందు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
- పెడుతున్న పెట్టుబడికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తుందా?
- రూ.10 లక్షల్లోపు కావాలంటే టాటా టియోగో ఒక్కటే ఆప్షన్
- రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికే ప్రయోజనం
పర్యావరణానికి అనుకూలంగా ఉంటుందని, నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయనే అభిప్రాయాలతో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ కార్ల కోసం కొంచెం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇంధన పరంగా ఆదా అవుతుందనే ఉద్దేశ్యంతో ఖరీదు ఎక్కువైనా కొనేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయడానికి ముందు ప్రతి ఒక్కరూ కొన్ని ప్రశ్నలు తప్పకుండా వేసుకోవాలి.
ఖరీదైన ఎలక్ట్రిక్ కారు కొనడం ఎందుకు?
ఈవీలు చాలా ఖరీదు. ప్రతి రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారికి ఆర్థికంగా ఇవి లాభదాయకమే కానీ, రోజూ 20-30 కిలోమీటర్ల తక్కువ దూరం ప్రయాణించే వారికి ఇవి భారమే. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ కనుక. కనీసం 1.40 లక్షల కిలోమీటర్ల దూరం ఎలక్ట్రిక్ కారులో తిరిగిన తర్వాతే పెట్రోల్ రూపంలో ఆదా ప్రయోజనం నెరవేరుతుందని ఒక అంచనా.
ఈవీ కార్ల ఆప్షన్లు?
రూ.10 లక్షల్లోపు కారు కావాలంటే, టాటా టియాగో ఈవీ, త్వరలో రానున్న సిట్రోయెన్ సీ2 మాత్రమే ఆప్షన్లు. కానీ, పెట్రోల్ కారు తీసుకునేట్టు అయితే రూ.10 లక్షల్లోపు బోలెడు కార్లున్నాయి. అంటే తక్కువ ధరలో ఈవీ కార్ల ఆప్షన్లు తక్కువ.
బ్యాటరీ చార్జింగ్
బ్యాటరీపై కార్ల తయారీ సంస్థలు ఎనిమిదేళ్ల వారంటీ ఇస్తున్నాయి. కార్ల ధరలో సింహ భాగం బ్యాటరీకి సంబంధించినదే. కనుక బ్యాటరీ మార్చుకోవాలంటే తిరిగి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పైగా బ్యాటరీ చార్జింగ్ సదుపాయాలు చూసుకోవాలి.
ఎలక్ట్రిక్ కారు అమ్మకం
కొంత కాలం పాటు వాడుకున్న తర్వాత కారును విక్రయించే అలవాటు ఉన్నవారు.. ఎలక్ట్రిక్ కారు వైపు చూడకపోవడమే మంచిదేమో? ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లకు సెకండరీ మార్కెట్ ఇంకా ఏర్పడలేదు. కనుక తిరిగి అమ్ముదామంటే తీసుకునే వారు కనిపించకపోవచ్చు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా, చాలా తక్కువ ధరకు అడగొచ్చు.