Chiranjeevi: విశ్వనాథ్ గారు కలిపిచ్చిన అన్నాన్ని శివుడి ప్రసాదంగా భావించినవాడిని నేను: చిరంజీవి
- కె.విశ్వనాథ్ తో తన జర్నీని గురించి ప్రస్తావించిన చిరంజీవి
- ఆయన తనకి గురువుతో సమానమని వ్యాఖ్య
- తండ్రిలా తన పట్ల ప్రేమను చూపించేవారని వెల్లడి
- అందరి మనసులో ఆయన ఎప్పటికీ ఉంటారన్న మెగాస్టార్
ఈ రోజున కె. విశ్వనాథ్ గారి జయంతి కావడంతో, ఆయనను స్మరించుకుంటూ 'కళాతపస్వికి కళాంజలి' పేరుతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పలువురు సినిమా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ .. "విశ్వనాథ్ గారి జయంతిని ఒక సంబరంగా చేసుకోవాలి. ఆయన మనకు వదిలి వెళ్లినటువంటి తీపి జ్ఞాపకాలు .. అనుభవాలు అలాంటివి. అందువలన ఇది ఒక సంతాప సభలా కాకుండా సంబరంగా జరుపుకోవాలి" అన్నారు.
"నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి విశ్వనాథ్ గారు. ఆయన నాకు ఒక దర్శకుడిగా .. గురువుగా .. తండ్రిలా కనిపించేవారు. నటనలో ఎన్నో మెళకువలు నేర్పించి నాకు అవార్డులు రావడానికి కారకులయ్యారు. ఒక తండ్రిగా నాకు ఆయన కలిపిచ్చిన అన్నాన్ని శివుడి ప్రసాదంగా తిన్నవాడిని నేను. అంతటి అనుబంధం మా ఇద్దరి మధ్య ఉంది. యాక్షన్ సినిమాలను వరుసగా చేసుకుంటూ వెళతున్న సమయంలో ఆయనతో 'శుభలేఖ' చేసే ఛాన్స్ వచ్చింది.
విశ్వనాథ్ గారి దగ్గర ఆడుతూ పాడుతూ చేయడం కుదరదని తెలిసిన నేను చాలా టెన్షన్ పడిపోయాను. కానీ డైలాగ్ ఎలా చెప్పాలనేది ఆ సినిమాతో .. ఆయన ద్వారానే నేర్చుకున్నాను. నేను కూడా క్లాసికల్ డాన్స్ చేయగలననే నమ్మకాన్ని నాపై నాకు కలిగించింది కూడా వారే. మాస్ ఇమేజ్ ఒక రేంజ్ లో ఉన్న సమయంలో నాతో 'స్వయం కృషి' చేయించారు. నా చెప్పులు నేనే కుట్టుకునే స్థాయిలో ఆయన నాకు ట్రైనింగ్ ఇచ్చారు" అని అన్నారు.
'ఆపద్బాంధవుడు'లో ఒక సీన్ కోసం విశ్వనాథ్ గారి ఇంటికి వెళ్లి ఆ రాత్రంతా అక్కడ రిహార్సల్స్ చేసినప్పుడు ఆయన ఎంతో ముచ్చటపడ్డారు. సెంటిమెంట్ సీన్స్ లో కేరక్టర్స్ కాకుండా చూసేవాళ్లు ఏడ్చేలా చేసే గొప్పతనం ఒక్క విశ్వనాథ్ గారికి మాత్రమే సొంతం. అలాంటి ఆయన దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన తీసిన సినిమాల ద్వారా మన మనసులో శాశ్వతంగా ఉంటారు" అంటూ చెప్పుకొచ్చారు.