Virat Kohli: సచిన్ ఆల్ టైం రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ
- అంతర్జాతీయ క్రికెట్ లో వేగంగా 25 వేల పరుగులు చేసిన కోహ్లీ
- 549 మ్యాచ్ లలోనే పూర్తి చేసి రికార్డు
- 577 మ్యాచ్ లలో 25 వేల పరుగుల మార్క్ అందుకున్న సచిన్
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.. అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు. లెజండరీ బ్యాట్స్ మన్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 25 వేల పరుగులను వేగంగా పూర్తి చేసిన క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. 577 మ్యాచ్ లలో సచిన్ 25 వేల పరుగుల మార్క్ ను అందుకోగా.. విరాట్ కోహ్లీ కేవలం 549 మ్యాచ్ లలోనే ఈ రికార్డును చేరుకున్నాడు. సచిన్ తర్వాత రికీ పాటింగ్ (588 మ్యాచ్ లు), జాక్వెస్ కల్లిస్ (594), కుమార సంగక్కర (608), మహేల జయవర్దనె (701) ఉన్నారు.
ఇక ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండున్నర రోజుల్లోనే టీమిండియా ఘన విజయం సాధించింది. తొలి రెండు రోజులు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్.. మూడో రోజు టీమిండియా వైపు తిరిగింది. రవీంద్ర జడేజా దెబ్బకు ఆసీస్ టీమ్ పేకమేడలా కుప్పకూలింది. 113 పరుగులకే ఆలౌట్ అయింది.
115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. పుజారా 31, రోహిత్ శర్మ 31, భరత్ 23, కోహ్లీ 20 పరుగులు చేశారు.