wedding insurence: వివాహ బీమా ఎందుకు చేయాలంటే.. !
- పెళ్లిలో అపశృతి జరిగితే ఈ బీమాతో కొంత ఉపశమనం
- కొవిడ్ తర్వాత వివాహ బీమాకు పెరుగుతున్న ప్రాముఖ్యత
- అనుకోని కారణాలతో పెళ్లి ఆగిపోతే ఏర్పాట్లకు వెచ్చించిన సొమ్ము రాబట్టుకోవచ్చు
కరోనా కష్టకాలంలో బీమా ఆవశ్యకత అందరికీ తెలిసి వచ్చింది. అంతకుముందు బీమా విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నవారు ఇప్పుడు తప్పనిసరిగా చేయిస్తున్నారు. జీవిత బీమా, ఆరోగ్య బీమాతో పాటు వాహనాలకు ఇన్సూరెన్స్ చేయిస్తున్నారు. అయితే, వివాహనికి కూడా బీమా చేయించుకోవచ్చని చాలామందికి ఇప్పటికీ తెలియదని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో జరిగే అతి ముఖ్యమైన సంఘటనలలో పెళ్లి ఒకటి.. ఉన్నంతలో పెళ్లిని గ్రాండ్ గా జరుపుకోవాలని అందరూ అనుకుంటారు.
ఏర్పాట్లకు తమ శక్తిమేరా ఖర్చుపెడతారు. ఏదైనా అనుకోని కారణం వల్ల పెళ్లి ఆగిపోతే.. ఈ ఖర్చులన్నీ వృధా.. వాటికి పెట్టిన డబ్బుల్లో రూపాయి కూడా తిరిగిరాదు. ఇలాంటి సందర్భాలలో వివాహ బీమా ఉపయోగపడుతుంది. అనుకోని అవాంతరాల వల్ల పెళ్లి నిలిచిపోయినపుడు బీమా ద్వారా ఖర్చులు కొంత రికవరీ చేసుకోవచ్చు. ఇందుకు చెల్లించాల్సిన ప్రీమియం కూడా తక్కువే.. బీమా చేసే మొత్తంలో 0.2 నుంచి 0.4 శాతం మాత్రమే!
బీమాలో కవరయ్యే నష్టాలు..
పెళ్లి మండపం, అలంకరణ, ఆహారం, హోటల్, ట్రావెల్ ఏజెన్సీ, ఆర్కెస్ట్రా మొదలైన వాటితో పాటు వివాహానికి సంబంధించి పొందిన సేవలకు అయిన మొత్తాన్ని కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఖరీదైన వస్తువులు చోరీకి గురైనా, అగ్ని ప్రమాదం, పేలుడు, భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని బీమా ద్వారా భర్తీ చేసుకోవచ్చు. అంతేకాదు, వివాహానికి వచ్చిన వారిలో ఎవరైనా మరణించినా, గాయాలైనా పరిహారం పొందొచ్చు.
ఈ సందర్భాలలో బీమా వర్తించదు..
అసాధారణ ఏర్పాట్ల వల్ల ప్రోగ్రామ్ రద్దవడం, యుద్ధం, తీవ్రవాదం, కిడ్నాప్, ఆత్మహత్య, వాయుకాలుష్యం వల్ల వాటిల్లే నష్టాలకు బీమా కవరేజీ వర్తించదు. నిర్ణీత వ్యవధిలోపు వివాహ వేడుకను పూర్తిచేయకపోయినా కూడా బీమా క్లెయిమ్ పొందలేరు. కాగా, వివాహ బీమా కవరేజీ సాధారణంగా 7 రోజుల పాటు ఉంటుంది. బీమా చేసే మొత్తాన్ని బట్టి చెల్లించాల్సిన ప్రీమియం మారుతుంటుంది. ఉదాహరణకు రూ.40 లక్షలకు వివాహ బీమా తీసుకోవాలంటే ఆ మొత్తంపై 0.2 నుంచి 0.4 శాతం.. అంటే సుమారు రూ.15 వేలు ప్రీమియంగా చెల్లించాలి.