Pakistan: మా దేశం ఆల్రెడీ దివాళా తీసింది.. పాక్ రక్షణ మంత్రి సంచలన ప్రకటన
- పాకిస్థాన్ దివాళా తీసిందన్న పాక్ రక్షణ మంత్రి
- గత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పైనా మంత్రి విమర్శలు
- ఇమ్రాన్ ఖాన్ చర్యలతో దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకుందని ఆరోపణ
పాకిస్థాన్ రక్షణ మంత్రి, పీఎమ్ఎల్-ఎన్ పార్టీ నేత ఖ్వాజా ఆసిఫ్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. పాకిస్థాన్ ఇప్పటికే దివాళా తీసిందంటూ ఓ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనం దివాళా తీసిన దేశంలో బతుకుతున్నాం. పాకిస్థాన్ విదేశీ అప్పులు చెల్లించలేకపోతోందని, ఆర్థిక సంక్షోభంలో ఉందన్న వార్తలు మీరందరూ వినే ఉంటారు. కానీ ఇది ఇప్పటికే జరిగిపోయింది. మనం దివాళా తీశాం. ఇప్పుడు మనం మళ్లీ మనకాళ్లపై నిలబడాలి. ఈ సమస్యకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పరిష్కారం కాదు..అసలు పరిష్కారం మన దేశంలోనే ఉంది’’ అని ఆయన అన్నారు.
ఓ ప్రైవేటు కాలేజీలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో మంత్రి ఖ్వాజా ఈ వ్యాఖ్యలు చేశారు. మునుపటి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపైనా ఆయన నిప్పులు చెరిగారు. దేశంలో ఉగ్రవాదం వేళ్లూనుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ చర్యలే కారణమని దుయ్యబట్టారు. ఆయన మొదలెట్టిన ఆట కారణంగా ఉగ్రవాదమే పాకిస్థాన్ గమ్యంగా మారిందని వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ ప్రస్తుతం అసాధారణ స్థాయిలో ఆర్థికఇబ్బందుల్లో కూరుకుపోయింది. కనీసావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ప్రస్తుతం దేశంలోని విదేశీ కరెన్సీ నిల్వలు మరోమూడు వారాల పాటు మాత్రమే దిగుమతులకు సరిపోతాయి. ఇదిలాఉంటే..గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సాయం పొందిన పాకిస్థాన్..వాయిదాలు కట్టడంలో విఫలం కావడంతో ఐఎమ్ఎఫ్.. నిధుల జారీని నిలిపివేసినట్టు సమాచారం.