Team India: మహిళల టీ20 వరల్డ్ కప్: భారత్ కు 152 పరుగుల టార్గెట్ నిర్దేశించిన ఇంగ్లండ్
- దక్షిణాఫ్రికాలో మహిళల టీ20 వరల్డ్ కప్
- నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య గ్రూప్-బి లీగ్ మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- ఐదు వికెట్లు తీసిన రేణుకా సింగ్
దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. ఈ గ్రూప్-బి లీగ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేశారు. నాట్ షివర్ బ్రంట్ 50 పరుగులు చేయగా, వికెట్ కీపర్ అమీ జోన్స్ 40 పరుగులతో రాణించింది. కెప్టెన్ హీదర్ నైట్ 28 పరుగులు చేసింది.
భారత అమ్మాయిల్లో రేణుకా ఠాకూర్ సింగ్ 4 ఓవర్లు విసిరి 15 పరుగులిచ్చి 5 వికెట్లు తీయడం విశేషం. శిఖా పాండే 1, దీప్తి శర్మ 1 వికెట్ తీశారు. రేణుకా ఠాకూర్ సింగ్ ధాటికి ఇంగ్లండ్ జట్టు ఓ దశలో 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ 3 వికెట్లు రేణుక ఖాతాలో చేరాయి. అయితే, కెప్టెన్ హీదర్ నైట్, నాట్ షివర్ జోడీ ఇంగ్లండ్ ను ఆదుకుంది. చివర్లో అమీ జోన్స్ ధాటిగా ఆడడంతో ఇంగ్లండ్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది.