c kalyan: కొందరు నిర్మాతలు దిల్‌ రాజును తప్పుదారి పట్టించారు: సి.కల్యాణ్

c kalyan fires on producers guild

  • దిల్‌ రాజుతో తనను పోలుస్తూ దుష్ప్రచారం చేశారన్న కల్యాణ్
  • నిర్మాతగా 80 చిన్న సినిమాలు తీశానని, ఎవరినీ మోసం చేయలేదని వ్యాఖ్య
  • గిల్డ్‌ మాఫియా, మోనోపలి వల్ల పరిశ్రమ నాశనమవుతుందని విమర్శ
  • చిన్న నిర్మాతలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన

కొంతమంది నిర్మాతలు దిల్‌ రాజును తప్పుదారి పట్టించారని నిర్మాత సి.కల్యాణ్‌ చెప్పారు. దిల్‌ రాజు, సి.కల్యాణ్‌ ప్యానెల్‌ వేర్వేరు కాదని అన్నారు. దిల్‌ రాజుతో తనను పోలుస్తూ దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. నిర్మాతగా తాను 80 చిన్న సినిమాలు తీశానని, ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. నిర్మాతల మండలి ఎన్నికల నేపథ్యంలో సి.కల్యాణ్‌ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.

సంస్థకు ఎవరు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోవాలని, తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కల్యాణ్ చెప్పారు. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుందని.. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న నిర్మాతలకు నిర్మాతల మండలిలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

దీనికి కారణం గిల్డ్‌ మాఫియానేనని మండిపడ్డారు. గిల్డ్‌లో ఉన్నది 27 మంది సభ్యులని.. దాని వల్ల పరిశ్రమకు ఎలాంటి లాభం లేదన్నారు. నిర్మాతల మండలిలో 1,200 మంది సభ్యులున్నారని.. గిల్డ్‌ సభ్యుల్లో వచ్చిన సమస్యలను కూడా నిర్మాతల మండలి పరిష్కరించిందని వివరించారు.

ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ను నిర్మాతల మండలిలో కలిపేందుకు తాను ప్రయత్నం చేశానని కల్యాణ్ తెలిపారు. కానీ అధ్యక్ష పదవి మోజులో కొందరు తన ప్రయత్నాన్ని నీరుగార్చారని ఆరోపించారు. గత ఆగస్ట్‌లో సినిమా షూటింగ్స్‌ నిలిపివేయడం వల్ల పరిశ్రమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు.

  • Loading...

More Telugu News