Dr BR Ambedkar Konaseema District: కోనసీమలో అమానుషం.. బాలికపై ఐదుగురు యువకుల అత్యాచారం!

An atrocity took place in Amalapuram

  • కాట్రేనికోన మండలం చిర్ర యానాంలో ఘటన 
  • బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం
  • గ్రామ పెద్దల సమక్షంలో రూ. లక్ష ఇవ్వజూపిన వైనం
  • పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరింపులు
  • గ్రామంలో విచారణ జరిపిన డీఎస్పీ.. నిందితుల అరెస్ట్

డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం సమీపంలో అమానుషం జరిగింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. కాట్రేనికోన మండలంలోని సముద్ర తీర గ్రామమైన చిర్ర యానాంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక ఈ నెల 6న బట్టలు ఉతికేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఐదుగురు యువకులు ఆమెపై కన్నేశారు. ఆమెను సరుగుడు తోటలోకి ఈడ్చుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించారు. 

ఈ క్రమంలో బాలిక అస్వస్థతకు గురికాగా, తల్లిదండ్రులు ఆరా తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం కాగా, గ్రామ పెద్దల సమక్షంలో నిందితులు లక్ష రూపాయలు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే, ఆ సొమ్మును తీసుకునేందుకు వారు నిరాకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న డీఎస్పీ వై.మాధవరెడ్డి సిబ్బందితో వెళ్లి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

Dr BR Ambedkar Konaseema District
Andhra Pradesh
Crime News
  • Loading...

More Telugu News