Jayamangala Venkataramana: వైసీపీలో చేరిన జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి.. ఒకేసారి 16 మంది పేర్ల ప్రకటన!
- నిన్ననే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన జయమంగళ
- ఇప్పటికే 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ.. మార్చి 29న మరో 9 ఖాళీ
- అనంతపురం, చిత్తూరులో బీసీ అభ్యర్థుల పేర్ల పరిశీలన
టీడీపీని వీడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో నిన్న వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఏలూరు జిల్లా కైకలూరు మాజీ శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ పదవి ఖరారైనట్టు తెలుస్తోంది. శాసనమండలిలో 9 స్థానిక సంస్థల సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. మార్చి 29న ఎమ్మెల్యేల కోటాలోని 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మొత్తం 16 స్థానాలకు కలిపి ఒకేసారి అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు వైసీపీ సిద్ధమైంది.
వైసీపీ ప్రకటించే ఆ 16 మంది అభ్యర్థుల జాబితాలో నిన్ననే పార్టీలో చేరిన జయమంగళ వెంకటరమణ కూడా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి జగన్ నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. కాగా, వెంకటరమణ రాకతో కొల్లేరు పరిధిలో ఆయన సామాజికవర్గం ప్రభావితం చేస్తుందని వైసీపీ భావిస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో మరో స్థానానికి గాను గుణ్ణం నాగబాబు/ వంకా రవీంద్ర, శ్రీకాకుళంలో నీలకంఠంనాయుడు/నర్తు రామారావు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక, కర్నూలులో బెస్త, అనంతపురంలో బీసీ మహిళకు, చిత్తూరులో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. నెల్లూరు అభ్యర్థి విషయంపై చర్చలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.