Revanth Reddy: ఎర్రబెల్లిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. టీడీపీలో ఉంటూనే కోవర్ట్‌గా పనిచేశారన్న టీపీసీసీ చీఫ్

Revanth Reddy Accuses Errabelli As A TRS Covert
  • కేసీఆర్ సీఎం కావడానికి ఎర్రబెల్లి పరోక్షంగా సహకరించారన్న రేవంత్
  • రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ జెండా రాష్ట్రంలో లేకుండా చేశారని మండిపాటు
  • తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్‌ను ఎత్తేస్తామని హామీ
  •  1 జనవరి 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా అని ధీమా
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేందుకు ఎర్రబెల్లి పరోక్షంగా సహకరించారని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూనే కోవర్టు ఆపరేషన్ చేసి అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)కు సహకరించారని రేవంత్ ఆరోపించారు. తనకు రాజకీయంగా భిక్ష పెట్టిన పార్టీ జెండా తెలంగాణలో లేకుండా చేశారని మండిపడ్డారు. ఎర్రబెల్లి, ఆయన అనుచరులు ధరణి పోర్టల్‌ను ఉపయోగించుకుని దందాలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్ర నిన్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి శాసనసభ నియోజకవర్గంలో దేవరుప్పుల నుంచి పాలకుర్తి వరకు సాగింది. 

ఈ సందర్భంగా పాలకుర్తిలో నిర్వహించిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. ఎర్రబెల్లిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రం తెచ్చిన వారికి రెండుసార్లు అధికారమిచ్చారని, రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఏడాది జనవరి 1న రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, ఆ వెంటనే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని అన్నారు. ఇందిరమ్మ పథకంలో ఇళ్లు నిర్మించుకునే వారికి రూ. 5 లక్షలు ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, రూ. 500కే వంటగ్యాస్ సిలిండర్‌ను అందిస్తామన్నారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకంలో ప్రస్తుతం ఉన్న రెండు లక్షల రూపాయల పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతామని రేవంత్ హామీ ఇచ్చారు.
Revanth Reddy
Hath Se Hath Jodo Yatra
Errabelli
Congress

More Telugu News