Pootharekulu: ఆత్రేయపురం పూతరేకులకు మరో ఘనత.. త్వరలోనే భౌగోళిక గుర్తింపు!
- భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసిన సర్ అర్ధర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం
- జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ జర్నల్‌లో పూతరేకులపై ప్రకటన
- అభ్యంతరాలు రాకుంటే భౌగోళిక గుర్తింపు ఇస్తూ ప్రకటన
డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం అనగానే వెంటనే పూతరేకులు గుర్తొస్తాయి. ఆ వెంటనే నోట్లోంచి నీళ్లు ఊరుతాయి. ఆత్రేయపురం పూతరేకులు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడీ పూతరేకులు అరుదైన ఘనత సొంతం చేసుకునే దిశగా ముందడుగు పడింది. వీటికి భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు దాదాపు చివరికి వచ్చాయి. ఆత్రేయపురానికి చెందిన సర్ అర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం.. వైజాగ్ దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ సహాకారంతో భౌగోళిక గుర్తింపు (జీఐ) కోసం చేసుకున్న దరఖాస్తు పరిశీలనలు పూర్తి చేసుకుంది.
వాణిజ్య పరిశ్రమల శాఖ ఈ నెల 13న విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇచ్చారు. ఈ విషయంలో ఎవరి నుంచీ అభ్యంతరం రాకుంటే చెన్నైలోని జీఐ రిజిస్ట్రేషన్ కార్యాలయం జీఐని నమోదు చేసి పూతరేకులకు భౌగోళిక గుర్తింపు ఇస్తున్నట్టు జర్నల్‌లో ప్రచురిస్తుంది. త్వరలోనే ఆ ప్రకటన కూడా వస్తుందని పూతరేకుల సహకార సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది.