KCR: కొండగట్టుకు అదనంగా మరో రూ.500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్

KCR announces more funds to Kondagattu

  • నేడు కొండగట్టు విచ్చేసిన సీఎం కేసీఆర్
  • ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
  • ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై అధికారులతో సమీక్ష
  • యాదాద్రి తరహాలోనే అభివృద్ధి చేయాలని సూచన

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.100 కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్... తాజా పర్యటనలో అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపారు. 

కాగా, ఈ ఉదయం హైదరాబాదు నుంచి హెలికాప్టర్ లో నాచుపల్లి జేఎన్టీయూ కాలేజీ వద్దకు చేరుకున్న సీఎం కేసీఆర్... అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు ఆలయ వర్గాలు పూర్ణకుంభ స్వాగతం పలికాయి. 

పాతికేళ్ల తర్వాత కేసీఆర్ కొండగట్టు రావడం ఇదే ప్రథమం. 1998లో కొండగట్టుకు వచ్చిన ఆయన, ఇప్పుడు సీఎం హోదాలో తొలిసారి ఇక్కడకు విచ్చేశారు. 

నేడు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో ఉన్న భేతాళస్వామి ఆలయం, సీతమ్మ కన్నీటిధార, కొత్త పుష్కరిణి, కొండలరాయుడి గుట్టలను పరిశీలించారు. కొండగట్టు అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ ను అధికారులతో కలిసి సమీక్షించారు. యాదాద్రి తరహాలోనే కొండగట్టు అంజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. 

కాగా, ఈ పర్యటనలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News