Canada: కెనడాలో మరో హిందూ ఆలయంపై పిచ్చి రాతలు
- ప్రధాని మోదీ, భారత్ కు వ్యతిరేకంగా ఆలయం గోడలపై నినాదాలు
- తీవ్రంగా స్పందించిన భారత్
- నేరస్థులను పట్టుకుని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
కెనడాలో ప్రత్యేక ఖలిస్థాన్ అనుకూల మూకల దుశ్చేష్టలు పెరిగిపోతున్నాయి. గ్రేటర్ టొరెంటో ప్రాంతంలోని మరో హిందూ దేవాలయం గోడలను పిచ్చిరాలతో నింపేశాయి. ప్రధాని మోదీ, భారత్ కు వ్యతిరేకంగా ఈ రాతలు ఉన్నాయి. గ్రేటర్ టొరెంటో ప్రాంతంలోని మిసిసుగాలో ఉన్న శ్రీరామ్ మందిర్ ను ఖలిస్థాన్ వేర్పాటు వాద అనుకూల వర్గాలు లక్ష్యం చేసుకున్నాయి. కెనడాలో గత ఎనిమిది నెలల్లో ఇది నాలుగో ఘటన.
దీనిపై శ్రీరామ్ మందిర్ ప్రెసిడెంట్ పండిట్ రూప్ నౌత్ శర్మ స్పందిస్తూ.. నేరస్థులు మరింత ధైర్యంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. హిందువుల పట్ల ఆమోదనీయం కాని రాతలతో సామరస్యాన్ని చెడగొట్టే ప్రయత్నంగా దీన్ని అభివర్ణించారు. ఈ రాతలతో తాము నిరాశకు గురైనట్టు పేర్కొన్నారు.
తాజా ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేరస్థులను పట్టుకోవాలని డిమాండ్ చేసింది. ‘‘రామమందిరం ఆకారాన్ని మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై విచారణ జరిపి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా అధికారులను కోరాం’’ అని టొరంటోలోని భారత కాన్సులేట్ ట్విట్ చేసింది.