Turkey: టర్కీ, సిరియాలో 41 వేలు దాటిన మరణాలు.. వారం తర్వాత కూడా శిథిలాల కింద కొందరు సజీవం
- వారం కిందట ఇరు దేశాల్లో భారీ భూకంపాలు
- గుట్టలుగా బయట పడుతున్న మృతదేహాలు
- సహాయ చర్యల్లో ప్రాణాలతో బయటపడుతున్న పలువురు
టర్కీ, సిరియాలలో సంభవించిన భారీ భూకంపాల్లో మృతుల సంఖ్య 41 వేలు దాటింది. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ గుట్టలుగా శవాలు బయట పడుతున్నాయి. అయితే, సహాయ చర్యల్లో పలువురు ప్రాణాలతో బయటకు వస్తున్నారు. వారం తర్వాత కూడా దక్షిణ టర్కీలోని శిథిలాల కింద నుంచి ఇంకా స్వరాలు వినిపిస్తున్నాయి. మంగళవారం టర్కీలో శిథిలాల నుంచి సహాయ సిబ్బంది తొమ్మిది మందిని ప్రాణాలతో బయటకు తీశారు. వారం రోజులుగా వీరు మృత్యువుతో పోరాడి గెలిచారు. కహ్రామన్‌మరాస్ ప్రావిన్స్‌లోని అపార్ట్‌మెంట్ బ్లాక్ నుంచి రక్షించిన 17, 21 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు సోదరులు ఇందులో ఉన్నారు.
అంటాక్యాలో సిరియన్ యువకుడు, యువతిని శిథిలాల నుంచి 200 గంటల తర్వాత రక్షించారు. భూకంపం సంభవించిన 212 గంటల తర్వాత టర్కీలోని అడియామాన్‌లో శిథిలాల నుంచి 77 ఏళ్ల వృద్ధుడితో పాటు 18 ఏళ్ల యువకుడిని బయటకు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దాంతో, శిథిలాల కింద ఇంకా చాలా మంది సజీవంగా ఉండవచ్చని సహాయ సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు భూకంపం తర్వాత ఇరు దేశాల్లో చాలా మంది నిరాశ్రయులయ్యారు. తీవ్రమైన చలిలో ఆశ్రయం, ఆహారం కోసం పోరాడుతున్న ప్రజలకు సహాయం చేయడంపై టర్కీ, సిరియా ప్రభుత్వాలు ఇప్పుడు దృష్టి సారించాయి.