CBSE: చాట్ జీపీటీ వినియోగంపై నిషేధం విధించిన సీబీఎస్ఈ
- 10, 12వ తరగతి పరీక్షల నేపథ్యంలో నిర్ణయం
- అనుచిత మార్గాల్లో పాస్ అయ్యేందుకు ప్రయత్నిస్తే చర్యలు
- విద్యార్థులను హెచ్చరించిన సీబీఎస్ఈ
చాట్ జీపీటీ ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. దీంతో సీబీఎస్ఈ అప్రమత్తమైంది. బోర్డు నిర్వహించే పరీక్షల్లో చాట్ జీపీటీ వాడడం నిషేధమని ప్రకటించింది. చాట్ జీపీటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్ వేర్ టూల్. వెబ్ బ్రౌజర్ కు అనుసంధానంగా పనిచేస్తుంది. గూగుల్ క్రోమ్, ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లపైనా పనిచేస్తుంది. కనుక కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో బ్రౌజర్లపై దీని సేవలు పొందొచ్చు.
మనకు ఏదైనా సమాచారం కావాలంటే గూగుల్ లో సెర్చ్ చేస్తుంటాం. మనం అడిగిన విషయానికి సంబంధించి క్లుప్తంగా కొంత సమాచారంతోపాటు, సంబంధిత యూఆర్ఎల్ పేజీలు కనిపిస్తాయి. కానీ, చాట్ జీపీటీ అలా కుప్పలు, తెప్పలుగా పేజీలు మన ముందు పడేయదు. నెట్ లో సమాచారాన్ని వెంటనే లాగేసి, చక్కగా, స్పష్టంగా ఒక డిటైల్డ్ నోట్ మాదిరిగా మనకు అందిస్తుంది. అందుకే ఇప్పుడు దీని పట్ల ప్రపంచవ్యాప్తంగా పెద్ద క్రేజీ ఏర్పడింది.
చాట్ జీపీటీని ఏది అడిగినా కాదనకుండా చెప్పేస్తుంది. చాలా సంక్లిష్టమైన మ్యాథ్స్ ను కూడా సులభతరం చేస్తుంది. కనుక పరీక్షల సమయంలో ప్రశ్న వేస్తే, సమాధానాన్ని కళ్ల ముందు ఉంచుతుంది. దాన్ని చూసుకుంటూ విద్యార్థి సులభంగా పరీక్ష రాసేయవచ్చు. ఈ ప్రమాదాన్ని గుర్తించి సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలు నేటి నుంచే మొదలయ్యాయి.
‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ జీపీటీ 10, 12 బోర్డ్ పరీక్షల సమయంలో వినియోగించడం నిషేధించడమైనది’’ అని సీబీఎస్ఈ అధికారులు విద్యార్థులకు సమాచారం ఇచ్చారు. మొబైల్, చాట్ జీపీటీ ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షల హాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్షల్లో పాస్ కావడానికి చాట్ జీపీటీ తదితర అనుచిత మార్గాలను ఆశ్రయిస్తే చర్యలకు బాధ్యులు అవుతారని విద్యార్థులను సీబీఎస్ఈ హెచ్చరించింది. నిషేదిత పరికరాలతో పట్టుబడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంది.