amih shah: 2024 ఎన్నికల్లో మాకు పోటీయే లేదు: అమిత్ షా
- యావత్ దేశం మోదీ వెంటే ఉంటుందన్న హోం శాఖ మంత్రి
- తాము తీసుకున్న చర్యలతో దేశంలో భద్రత, అభివృద్ధి సాధ్యమైనట్టు వెల్లడి
- ఈ ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మంచి ఫలితాలు సాధిస్తామన్న ఆశాభావం
2024 ఎన్నికల్లో తమకు ఎలాంటి పోటీ ఉండదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. యావత్ దేశం మోదీకి మద్దతుగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఎన్నో చర్యలు, కార్యక్రమాలతో క్షేత్రస్థాయిలో ప్రజల జీవితాల్లో సానుకూలమైన మార్పు కనిపిస్తోందన్నారు. అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా మోదీ వెంటే నిలబడతారని, తమకు పోటీ ఉండదన్న అభిప్రాయాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు.
ప్రజలు గత ఎన్నికల్లో ఎవ్వరికీ ప్రతిపక్ష హోదా కట్టబెట్టలేదన్న విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాన ప్రతిపక్షం ఎవరనేది తేలుస్తారని చెప్పారు. ఎన్నికలు జరిగే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలో రాహుల్ గాంధీ ప్రచారం చేయకపోవచ్చన్నారు. కాంగ్రెస్ ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన ఈ రాష్ట్రాల్లో ఆ పార్టీ బలమేంటో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తేలుస్తారని అమిత్ షా వ్యాఖ్యానించారు.
ఈ రాష్ట్రాలతో పాటు, ఈ ఏడాది ఎన్నికలు జరిగే కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందని అమిత్ షా అంచనా వేశారు. దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని చెబుతూ.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారినట్టు పేర్కొన్నారు. అంతర్గత భద్రతను తమ సర్కారు బలోపేతం చేసిందని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించినట్టు వివరించారు.