COVID19: ఈ ఆరు దేశాల ప్రయాణికులకు శుభవార్త.. నేటి నుంచి కొవిడ్ నిబంధనలను ఎత్తేసిన కేంద్రం
- చైనా సహా ఆరు దేశాల ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను ఎత్తేసిన ప్రభుత్వం
- ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతుండడమే కారణం
- దేశంలో రోజుకు 100లోపే నమోదవుతున్న కేసులు
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఇప్పటి వరకు ఉన్న కొవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం నేటితో ఉపసంహరించుకుంది. చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయిలాండ్, జపాన్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రీ బోర్డింగ్ ఆర్టీ పీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేసిన ప్రభుత్వం దాదాపు నెల రోజుల తర్వాత వాటిని ఎత్తివేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం, పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పైన పేర్కొన్న ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ ఆంక్షలు తొలగించిన ప్రభుత్వం ‘ఎయిర్ సువిధ’ ఫామ్‌ను అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను కూడా తొలగించింది.
నేటి ఉదయం 11 గంటల నుంచే తాజా ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా గత కొన్ని వారాలుగా కరోనా కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అంతకుముందు 28 రోజులతో పోలిస్తే గత 28 రోజుల్లో కొత్త కేసుల సంఖ్య 89 శాతం తగ్గింది. ఇక దేశీయంగానూ కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గింది. రోజుకు వందలోపే కేసులు నమోదవుతున్నాయి. నిన్న మాత్రం 124 కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపి క్రియాశీల కేసుల సంఖ్య 1,843కి పెరిగింది. కొవిడ్ కారణంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,750కి చేరుకుంది.