yadadri temple: యాదాద్రి వెళుతున్నారా.. ఈ వివరాలు మీకోసమే !

Yadagirigutta Temple Pooja Seva Darshanam Ticket Prices Room rent Details

  • స్వామివారి దర్శనం టికెట్లను ఆన్ లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చు
  • వీఐపీ, వీవీఐపీ బ్రేక్ దర్శనం కూడా పొందే అవకాశం
  • ఈ నెల 28న ఆలయంలో తిరుకల్యాణ మహోత్సవం

తిరుమల వేంకటేశ్వరుడి ఆలయంతో సమానంగా యాదాద్రిని తెలంగాణ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఇటీవలే నిర్మాణ పనులు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదాద్రీశుడి దర్శనం కోరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. స్వామి వారి దర్శన టికెట్లను ఇంట్లో కూర్చునే బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుని నేరుగా దర్శనానికి వెళ్లేలా మార్పులు చేసింది. ఆలయ సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఈ విధానాన్ని అమలు చేస్తోంది.

యాదాద్రి అధికారిక వెబ్ సైట్ yadadritemple.telangana.gov.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, స్వామి వారికి కానుకలు సమర్పించుకోవచ్చు. వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న నేతల సిఫార్సులతో వచ్చే భక్తులకు రూ.300 టికెట్‌తో ఆలయ అధికారులు బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం టికెట్ పొందవచ్చు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28 నుంచి జరగనున్నతిరుకల్యాణ మహోత్సవం-2023 టికెట్లను కూడా ఆన్ లైన్ లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ టికెట్ ఖరీదు రూ.3 వేలుగా నిర్ణయించారు.

పూజల వివరాలు..
స్కూటర్ పూజ రూ.300, ఆటో పూజ రూ.400, కారు పూజ రూ.500, బస్సు, లారీ, ట్రాక్టర్ పూజ రూ.1000గా ఫిక్స్ చేశారు. యాదాద్రీశుడికి పదేళ్ల పాటు చేసే శాశ్వత నిత్యపూజకు రూ.15వేలు, శాశ్వత నిత్య సహస్రనామార్చన రూ.15 వేలుగా నిర్ణయించారు. అష్టోత్తర ఘటాభిషేకం రూ.1000, దర్బార్ సేవ రూ.516, శ్రీ సత్యనారాయణస్వామి వ్రతం రూ.800, స్వర్ణపుష్పార్చన రూ.600, శయనోత్సవం రూ.100, సుప్రభాత దర్శనం రూ.100 గా ఆలయ కమిటీ నిర్ణయించింది. మరోవైపు, రాత్రిపూట యాదాద్రిలో బస చేయాలనుకునే భక్తులు కొండ కింద ఉన్న లక్ష్మీ నిలయం కాటేజీలో నాన్ ఏసీ రూ.560, నాన్ ఏసీ డీలక్స్ రూ.1000 లు చెల్లించి రూమ్ తీసుకోవచ్చు.

More Telugu News