Nirmala Sitharaman: దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది: నిర్మలా సీతారామన్

Nirmala Sitharama speech in Lok Sabha

  • లోక్ సభలో బడ్జెట్ పై సాధారణ చర్చ
  • సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి
  • 2023-24లోనూ భారత్ పయనం ఆగదన్న నిర్మల
  • సంక్షోభం నుంచి కోలుకుంటూ ప్రవేశపెట్టిన బడ్జెట్ అని వెల్లడి

లోక్ సభలో బడ్జెట్ పై సాధారణ చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ దేశం అభివృద్ధి పథంలో స్థిరంగా ముందుకు పోతోందని తెలిపారు. 2023-24లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడిగేందుకు మూలధన వ్యయం పెంపు మార్గాన్ని కేంద్రం ఎంచుకుందని వివరించారు. చైనాలో కరోనా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా వస్తు ధరలు పెరిగాయని, ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితులు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నడుమ... సంక్షోభం నుంచి కోలుకుంటూ  ప్రవేశపెట్టిన బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ వివరించారు. భారత్ లోనే కాకుండా, అనేక దేశాల్లో వాతావరణ వైపరీత్యాల పరిస్థితి ఆహార ద్రవ్యోల్బణానికి దారితీసిందని తెలిపారు. 

ఇక, నూతన ఆదాయ పన్ను వ్యవస్థలో ఎలాంటి షరతులు లేని రిబేట్ పెంపుదల నిర్ణయం తీసుకున్నామని నిర్మల సభకు వివరించారు. తమ తప్పనిసరి అవసరాలకు అత్యధిక మొత్తంలో ఖర్చు చేసే తక్కువ ఆదాయ వర్గాల వారికి ఇది ఎంతగానో ప్రయోజనకరంగా ఉండే విధానం అని అభివర్ణించారు. 

రూ.9 లక్షల వేతనం ఉండే వ్యక్తి అందులో రూ.4.5 లక్షలకు మినహాయింపు కలిగివుండడం, అదే సమయంలో కుటుంబం కోసం ఖర్చు చేసేందుకు తగినంత డబ్బును కలిగివుండడం అనేది ఎల్లప్పుడూ సాధ్యపడకపోవచ్చని వివరించారు. మొత్తమ్మీద భారతదేశ ఆర్థిక అవసరాలను సమతుల్యం చేసే బడ్జెట్ ఇదని నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్ ను నిర్వచించారు. 

ఇక, ఆహార సబ్సిడీల్లో కోత విధించారన్న విపక్షాల ఆరోపణల పట్ల కూడా ఆమె స్పందించారు. విపక్షాల వాదనల్లో పస లేదని, తాము ఆహార సబ్సిడీలను రూ.1.97 లక్షల కోట్లతో రెట్టింపు చేశామని స్పష్టం చేశారు.

Nirmala Sitharaman
Budget
Lok Sabha
BJP
India
  • Loading...

More Telugu News