Jagga Reddy: సీఎం కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

Jagga Reddy met CM KCR

  • తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • అసెంబ్లీలోని సీఎం చాంబర్ కు వెళ్లిన జగ్గారెడ్డి
  • నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై సీఎంతో మాట్లాడానన్న జగ్గారెడ్డి
  • ఈ భేటీలో తప్పేమీ లేదని వెల్లడి

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేడు సీఎం కేసీఆర్ ను కలిశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చాంబర్ కు వెళ్లిన జగ్గారెడ్డి... కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై మాట్లాడేందుకే సీఎంను కలిశానని వెల్లడించారు. 

తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రధానిని కలుస్తుంటారని, అలాంటప్పుడు ఓ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవడం తప్పేమీ కాదని సమర్థించుకున్నారు. దీనివల్ల తనకు వచ్చే నష్టం ఏమీలేదని అన్నారు. 

అంతేకాదు, సీఎం కేసీఆర్ మరోసారి కలవాలని తనకు సూచించారని జగ్గారెడ్డి వెల్లడించారు. తాను చేసిన ప్రతిపాదనల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వివరించారు. 

కేసీఆర్ అపాయింట్ మెంట్ ఇస్తే ప్రగతి భవన్ కు వెళ్లి కలుస్తానని జగ్గారెడ్డి చాలాకాలంగా చెబుతున్నారు. ఇన్నాళ్లకు ఆయనకు కేసీఆర్ అపాయింట్ మెంట్ లభించడం, ఇరువురూ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Jagga Reddy
KCR
Congress
BRS
Telangana
  • Loading...

More Telugu News