Chandrababu: జగన్ తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుంటున్నారు: చంద్రబాబు

Chandrababu slams CM Jagan over AP Capital

  • ఏపీ రాజధాని అంశంపై చంద్రబాబు ప్రెస్ మీట్
  • ఏపీ రాజధానిపై సుప్రీంలో కేంద్రం అఫిడవిట్ వేసిందన్న చంద్రబాబు
  • అఫిడవిట్ లోని అంశాలను వివరించిన టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ తనకు లేని అధికారాన్ని ఆపాదించుకుని రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చేసే విధ్వంసాలను సరిదిద్దడం రాజ్యాంగ సంస్థలకు సైతం కష్టంగా మారిందని పేర్కొన్నారు. 

రాష్ట్ర రాజధానిపై నిన్న కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసిందని చంద్రబాబు వెల్లడించారు. రాజధానిపై శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించిందని తెలిపారు. శివరామకృష్ణ కమిటీ తన నివేదికను అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని  కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియజేసిందని చంద్రబాబు వివరించారు. అంతేకాకుండా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేసిందని వెల్లడించారు. 

"ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం తీసుకువచ్చిందని, రాష్ట్రం తమను సంప్రదించకుండానే ఈ చట్టం తీసుకువచ్చిందని కేంద్రం వెల్లడించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ విషయాలు చెప్పింది" అని చంద్రబాబు పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచించకుండా సీఎం అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. "విభజన చట్టం సెక్షన్ 5లో రాజధానిపై స్పష్టంగా ఉంది. అయినప్పటికీ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. నాడు చట్టబద్ధంగా ప్రజా రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ప్రధాని వచ్చి శంకుస్థాపన చేశారు. పార్లమెంటు మొత్తం అమరావతికి అండగా ఉంటుందని శంకుస్థాపన రోజున ప్రధాని హామీ ఇచ్చారు" అని చంద్రబాబు వివరించారు.

More Telugu News