Toothache Day: పంటి నొప్పి వెనుక ఐదు కారణాలు..!
- నొప్పి వచ్చినా, లాగుతున్నట్టు అనిపించినా వైద్యులను సంప్రదించాలి
- దంతాలు పుచ్చుతున్నట్టు అయితే తగిన చికిత్సతో పరిష్కారం
- నోటి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం
పంటి నొప్పి వచ్చినప్పుడు చాలా మంది దాన్ని సీరియస్ గా తీసుకోరు. ‘లైట్’ తీస్కో అనే ధోరణితో ఉంటారు. కానీ, పంటి నొప్పికి కారణాలు తెలుసుకోకుండా అలా వదిలేయడం మంచి విధానం కాదు. ఎందుకంటే దంతాలు పాడైపోతున్న తరుణంలోనూ నొప్పి రావచ్చు. అందుకే నొప్పి అనిపించినప్పుడు వైద్యులను సంప్రదించడం వల్ల ఆ సమస్య పెద్దది కాకుండా చూసుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
పళ్లు పుచ్చడం అని వినే ఉంటారు. ఇలా దంతాలు దెబ్బతింటున్న క్రమంలో పంటి సహజ రక్షణ బలహీనపడుతుంది. దీంతో కొన్ని రకాల అసిడిక్ స్వభావం ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు జివ్వుమని లాగడం, నొప్పిరావడం జరగొచ్చు. దంత వైద్యుల వద్దకు వెళితే డ్రిల్ చేసి దెబ్బతిన్న పంటిని రీఫిల్లింగ్ చేస్తారు. దంతం పుచ్చినప్పుడు బ్యాక్టీరియా నరాల వరకు వెళ్లి ప్రభావం చూపిస్తుంది. దీంతో పంటి నొప్పి తీవ్రంగా వస్తుంది. దీన్ని రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ తో సరిచేస్తారు.
పంటి చిగుళ్లు వాయడం, ఇన్ఫెక్షన్ కారణంగా లాగడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. చిగుళ్ల నుంచి రక్తం కారొచ్చు. అందుకే కారణం ఏంటన్నది తెలుసుకుని చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
నోటి శుభ్రత ఎంతో అవసరం. లేదంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. నోటి నుంచి దుర్వాసన, నొప్పి మంట అనేవి కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
జ్ఞాన దంతాలు అందరికీ పూర్తిగా పైకి రావు. చాలా మందిలో కొంత వరకు బయటకు వచ్చి ఆగిపోతాయి. దీంతో ఇవి ఇన్ఫెక్షన్ కు కేంద్రాలుగా ఉంటున్నాయి. తిన్న ఆహార పదార్థాలు అక్కడ చిక్కుకుని కుళ్లిపోయి, దంతాలు దెబ్బతినేందుకు కారణమవుతున్నాయి. కనుక రోజులో రెండు నుంచి మూడు పర్యాయాలు, ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత మంచి టూత్ పేస్ట్ తో బ్రష్ చేసుకున్నట్టయితే ఈ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
ఫ్రాక్చర్
ప్రమాదాల్లో దంతాలకూ గాయం కావచ్చు. కింద పడినప్పుడు దవడ భాగం కదలడంతో పాటు, పంటి పునాదులు కదలొచ్చు. దీనివల్ల తర్వాతి కాలంలో నొప్పి వస్తుంటుంది. ఫ్రాక్చర్ అయితే వాపు వస్తుంది. రక్త స్రావం కూడా కావచ్చు. లేదంటే కింద పడిపోయినప్పుడు కొద్దిగా దెబ్బ తగిలి ఉంటే తర్వాత కేవలం నొప్పి రూపంలోనే కనిపించొచ్చు.