- భారత్ సాధించిన విజయాల్లో అతడి సేవలు గొప్పవన్న సచిన్
- జట్టులోనూ అతడి ప్రాధాన్యతను సరిగ్గా గుర్తించినట్టు లేదన్న లెజెండరీ క్రికెటర్
- ఆస్ట్రేలియాతో సిరీస్ లో 100 టెస్టుల మైలురాయికి పుజారా
చటేశ్వర్ పుజారా చాలా విరామం తర్వాత ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం ఎంపికయ్యాడు. అంతేకాదు మొదటి టెస్ట్ తుది జట్టులోనూ భాగంగా ఉన్నాడు. అతడికి ఇది 99వ టెస్ట్ మ్యాచ్ కానుంది. ఈ సిరీస్ తో అతడు 100 టెస్ట్ ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం దీనికి వేదిక కానుంది. ఇక్కడే ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. దీనిపై లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు.
‘‘పుజారా సాధించిన విజయాలకు తగిన గుర్తింపు రాలేదన్నది నా అభిప్రాయం. జట్టులో అతడి ప్రాధాన్యతను కూడా సరైన విధంగా గుర్తించినట్టు లేదు. దేశం కోసం అతడు అద్భుతంగా ఆడాడు. భారత జట్టు సాధించిన విజయాల్లో అతడు అందించిన సేవలు నిజంగా గొప్పవి’’ అని సచిన్ పేర్కొన్నాడు. టెస్ట్ మ్యాచుల్లో పుజారా క్రీజులో పాతుకుపోయి బౌలర్లకు విసుగుతెప్పించే రకమని తెలిసిందే. తన ఇన్నింగ్స్ తో అతడు ఎన్నో మ్యాచ్ ల్లో భారత్ విజయానికి పాటు పడ్డాడు. అందుకే సచిన్ పుజారా విషయంలో ఇలా వ్యాఖ్యానించాడు.
ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో మరో క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో 25,000 పరుగుల మైలురాయిని చేరుకోనున్నాడు. దీన్ని సాధించేందుకు అతడు మరో 64 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే, దేశీయంగా జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో కోహ్లీ 3,847 పరుగులు సాధించాడు. 4,000 పరుగుల మైలురాయికి దగ్గర్లోనే ఉన్నాడు.