- విటమిన్ డీ లోపించకుండా చూసుకోవడం అవసరం
- ఇది లోపిస్తే టైప్ 2 డయాబెటిస్ రిస్క్
- శరీర జీవక్రియలు, వ్యాధి నిరోధక శక్తిలో విటమిన్ డీ పాత్ర
సూర్యుడి కిరణాల నుంచి సహజసిద్ధంగా మన శరీరం విటమిన్ డీని తయారు చేసుకుంటుంది. శరీర జీవ క్రియలు, వ్యాధి నిరోధక శక్తికి ఇది చాలా అవసరం. కరోనా మహమ్మారి వచ్చేవరకు విటమిన్ డీ ప్రాధాన్యం గురించి చాలా మందికి తెలియదు. కరోనా సమయంలో వ్యాధి నిరోధక శక్తి కోసం విటమిన్ డీ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో దీనిపై అవగాహన పెరిగింది. నిజానికి గతంతో పోలిస్తే నేటి జీవన శైలి వేరు. ఎండలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాలా మంది జీవితాలు సాగిపోతున్నాయి. దీంతో విటమిన్ డీ లోపిస్తోంది.
విటమిన్ డీ లోపం ఎన్నో సమస్యలు కారణమవుతుంది. ముఖ్యంగా విటమిన్ డీని సమృద్ధిగా అందేలా చూసుకోవడం ద్వారా టైప్2 మధుమేహం బారిన పడకుండా చూసుకోవచ్చని తాజా అధ్యయనం ఒకటి చెబుతోంది. ఇన్సులిన్ విడుదల, గ్లూకోజ్ మెటాబాలిజంలోనూ విటమిన్ డీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. రక్తంలో విటమిన్ డీ స్థాయి తక్కువగా ఉన్న వారికి మధుమేహం రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఎన్నో అధ్యయనాలు గతంలోనూ వెల్లడించాయి.
మధుమేహంపై విటమిన్ డీ సప్లిమెంట్ల పాత్ర ఏ మేరకో తెలుసునేందుకు, అమెరికాలోని టఫ్ మెడికల్ సెంటర్ బృందం పరిశోధన చేసింది. మూడు క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను మూడేళ్లపాటు విశ్లేషించింది. విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకున్న వారిలో 22.7 శాతం మంది మధుమేహం బారిన పడ్డారు. ఉత్తుత్తి మాత్రలను తీసుకున్న వారిలో 25 శాతం మంది మధుమేహానికి గురయ్యారు. అంటే 15 శాతం రిస్క్ తగ్గినట్టుగా ఈ అధ్యయనం పేర్కొంది. విటమిన్ డీ ఇవ్వడం వల్ల కోటి మందిలో మధుమేహం అభివృద్ధి చెందడం ఆలస్యమైనట్టు వీరు గుర్తించారు. అయితే, మధుమేహం రిస్క్ ను తగ్గించుకునేందుకు విటమిన్ డీని ఇష్టా రీతిగా వాడుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విటమిన్ డీ ఎక్కువైనా అనర్థమేనని, వైద్యుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.