babu mohan: నువ్వెంత? నీ బతుకెంత?: బీజేపీ కార్యకర్తపై బాబు మోహన్ ఆగ్రహం.. ఆడియో వైరల్

babu mohan audio recording with party leader going viral
  • మళ్లీ ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతానన్న బాబు మోహన్ 
  • నాతో మాట్లాడ్డానికి అనర్హుడివంటూ కార్యకర్తపై మండిపాటు
  • అవసరమైతే రేపే పార్టీకి రాజీనామా చేస్తానని వ్యాఖ్య
బీజేపీ కార్యకర్తపై మాజీ మంత్రి బాబు మోహన్ శివాలెత్తారు. బూతుపురాణం అందుకున్నారు. తనకు ఫోన్ చేసిన కార్యకర్తపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘చెప్పు తమ్ముడూ’ అని అంటూనే విరుచుకుపడ్డారు. అందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకటరమణ అనే బీజేపీ కార్యకర్త.. బాబు మోహన్ కు ఫోన్ చేశారు. చెప్పు తమ్ముడు అని పలకరించిన ఆయన.. ‘పార్టీలో మీతో కలిసి పనిచేస్తాను’ అని వెంకటరమణ చెప్పడంతో కోపంతో ఊగిపోయారు.

‘‘అసలు నువ్వెవడివి? నువ్వెంత? నీ బతుకెంత? నేను ప్రపంచస్ధాయి నాయకుడిని ’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘అవసరమైతే రేపే పార్టీకి రాజీనామా చేస్తా.. నువ్వు కావాలో.. నేను కావాలో పార్టీ తేల్చుకుంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసేందుకు అమిత్ షా నన్ను బీజేపీలో చేర్చుకున్నారు’’ అని అన్నారు.

బండి సంజయ్ పేరును సదరు కార్యకర్త ప్రస్తావించగా.. ‘‘బండి సంజయ్ ఎవడ్రా?.. వాడు నా తమ్ముడు’’ అని అన్నారు. ఇంకోసారి ఫోన్ చేస్తే జోగిపేటలో చెప్పుతో కొడతానంటూ హెచ్చరించారు.

‘‘ఓ కార్యకర్తకు ఇచ్చే మర్యాద ఇదేనా? నేను ఎంతో కాలం నుంచి బీజేపీలో ఉన్నా, కష్టపడుతున్నా’’ అని వెంకటరమణ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో బాబుమోహన్ రెచ్చిపోయారు. ‘‘నీ వయస్సు ఎంత? జోగిపేటకు నువ్వేం చేయగలవు? నీకు ఎన్ని ఓట్లు? నీ స్థాయి ఎంత? నువ్వు నాతో మాట్లాడ్డానికి అనర్హుడివి’’ అంటూ విరుచుకుపడ్డారు. కావాలంటే ఫోన్ కాల్ రికార్డు చేసుకోవాలని, ఇంకోసారి ఫోన్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
babu mohan
audio recording
BJP
viral audio
andole

More Telugu News