Pakistan: పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ.. తరలిపోనున్న ‘ఆసియా కప్’

Asia Cup 2023 likely to move out of Pakistan

  • ఆసియాకప్ 2023 హక్కులను సొంతం చేసుకున్న పాక్
  • పాకిస్థాన్‌లో జరిగితే భారత జట్టు పర్యటించబోదన్న బీసీసీఐ
  • అదే జరిగితే ప్రపంచకప్ కోసం తాము భారత్ వెళ్లబోమన్న పాక్
  • మార్చిలో జరిగే సమావేశంలో వేదిక మార్పుపై చర్చ
  • అయితే, శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహించే అవకాశం

ఆసియాకప్ నిర్వహణ విషయంలో పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తప్పేలా లేదు. ఆసియాకప్‌ విషయంలో పాక్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఆసియాకప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే, భారత్‌లో ఈ ఏడాది జరగనున్న ప్రపపంచకప్‌కు తాము కూడా రాబోమని పాకిస్థాన్ పలుమార్లు బాహాటంగానే ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్థాన్‌కు షాకిచ్చే నిర్ణయం తీసుకునేందుకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆసియాకప్ 2023ని యూఏఈకి తరలించాలని నిర్ణయించినట్టు సమాచారం. నిన్న బహ్రెయిన్‌లో జరిగిన ఏసీసీ సమావేశంలో ఈ విషయమై చర్చ జరిగింది. అయితే, తుది నిర్ణయం మాత్రం మార్చిలో జరగనున్న సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది. బహ్రెయిన్‌లో నిన్న జరిగిన సమావేశానికి ఏసీసీ చీఫ్ జై షా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ నజమ్ సేథీ, ఇరు దేశాల బోర్డుల ప్రతినిధులు హాజరయ్యారు.    

ఆసియాకప్ 50 ఓవర్ టోర్నీకి సంబంధించి పాకిస్థాన్ ఆతిథ్య హక్కులను సొంతం చేసుకుంది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్‌కు ముందు ఆసియాకప్ జరగనుంది. అయితే, ఆసియాకప్‌ను పాకిస్థాన్ వెలుపల నిర్వహించనున్నట్టు బీసీసీఐ కార్యదర్శి జై షా గతేడాది చెప్పారు. దీనిపై పాక్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ రమీజ్ రాజా తీవ్రంగా స్పందించారు. భారత్ కనుక ఆసియాకప్ కోసం పాక్‌లో పర్యటించకుంటే భారత్‌లో జరిగే ప్రపంచకప్‌ను తాము బహిష్కరిస్తామన్నారు.

భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించాలా? వద్దా? అనే విషయాన్ని భారత ప్రభుత్వం నిర్ణయిస్తుందని బీసీసీఐ చెబుతోంది. కాగా, మార్చిలో జరగనున్న ఏసీసీ సమావేశంలో ఆసియాకప్ తరలింపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. శ్రీలంక, యూఏఈలను ఇందుకోసం పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, శ్రీలంకలో రాజకీయ సంక్షోభం కారణంగా గతేడాది అక్కడ జరగాల్సిన ఆసియాకప్‌ను యూఏఈకి తరలించారు. ఇప్పుడు పాకిస్థాన్ నుంచి కూడా ఆసియాకప్‌ను తరలించాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే పాకిస్థాన్ ఆడుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

Pakistan
BCCI
PCB
ACC
Asia Cup 2023
UAE
Sri Lanka
  • Loading...

More Telugu News