- వొడాఐడియా కట్టాల్సిన బకాయిలకు బదులు ఈక్విటీ
- ఒక్కో షేరు రూ.10 చొప్పున కేటాయింపు
- అన్ని అనుమతులు మంజూరు చేసిన కేంద్రం
భారీ అప్పుల భారంతో కనాకష్టంగా నెట్టుకొస్తున్న ప్రైవేటు టెలికం సేవల కంపెనీ వొడాఫోన్ ఐడియాకు కేంద్రం ఉపశమనం కల్పించింది. వొడాఫోన్ ఐడియా కేంద్ర ప్రభుత్వానికి స్పెక్ట్రమ్ బకాయిలు, వీటిపై వడ్డీలు చెల్లించాల్సి ఉంది. కానీ, వొడాఫోన్ వద్ద ఆర్థిక బలం లేదు. ఇప్పటికీ వార్షికంగా రూ.28 వేల కోట్ల నష్టాలను వొడాఫోన్ ఐడియా నమోదు చేస్తోంది. బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో కంపెనీలో వాటా తీసుకునేందుకు కేంద్ర సర్కారు అంగీకారం తెలిపింది.
వాటా తీసుకునేందుకు కేంద్రం లోగడే ఓకే చెప్పినప్పటికీ.. ఈ విషయంలో చాలా కాలంగా ముందడుగు పడడం లేదు. దీనికి కారణం తనకు రావాల్సిన బకాయిల్లో కొంత భాగానికి వాటా కింద తీసుకునే ముందు.. వొడాఫోన్ ఐడియా ప్రమోటర్లు తమవైపు నుంచి కంపెనీలోకి తాజా పెట్టుబడులు తీసుకురావాలని కేంద్ర సర్కారు కోరుతోంది. దీనిపై వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా కేంద్ర సర్కారుతో పలు మార్లు చర్చలు కూడా నిర్వహించారు. తమ వైపు నుంచి రూ.20,000 కోట్ల నిధుల సమీకరణ చేపడతామని, వెంటనే 5జీ సేవలు మొదలు పెడతామని ఆదిత్య బిర్లా గ్రూప్, వొడాఫోన్ పీఎల్ సీ కేంద్ర సర్కారుకు హామీ ఇచ్చాయి.
దీంతో వొడాఫోన్ ఐడియాలో 33 శాతం ఈక్విటీ వాటాను కేంద్ర సర్కారు తీసుకునేందుకు అంగీకారం తెలిపింది. షేర్ల కేటాయింపు తర్వాత ప్రస్తుత ప్రమోటర్లతో పోలిస్తే కేంద్ర సర్కారు అతిపెద్ద వాటాదారుగా అవతరిస్తుంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో వొడాఫోన్ ఐడియా షేరు ధర రూ.7.00 దగ్గర ఉన్నప్పటికీ, ఒక్కో షేరును ముఖ విలువ అయిన రూ.10 చొప్పున కంపెనీల చట్టంలోని నిబంధనల కింద కేంద్ర సర్కారు తీసుకోనుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా బోర్డులో నిర్ణయం తీసుకుని, వాటాదారుల ఆమోదం తర్వాత కేంద్ర సర్కారుకు ఈక్విటీ కేటాయించాల్సి ఉంటుంది. గత డిసెంబర్ నాటికి వొడాఫోన్ ఐడియాలో ప్రమోటర్లు అయిన వొడాఫోన్ పీఎల్ సీకి 48 శాతం వాటా ఉంటే, ఆదిత్య బిర్లా గ్రూప్ నకు 27 శాతం వాటా ఉంది.