Tammineni Sitaram: ఏపీ రాజధాని ఏదని గూగుల్ లో వెదికితే విశాఖనే చూపిస్తుంది: తమ్మినేని సీతారాం

Tammineni Sitharam opines on AP Capital

  • ఢిల్లీలో ఏపీ రాజధానిపై వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్
  • విశాఖ రాజధాని కాబోతోందని వెల్లడి
  • తాను కూడా విశాఖ షిఫ్ట్ అవుతున్నట్టు ప్రకటన
  • సీఎం నిర్ణయాన్ని స్వాగతించిన తమ్మినేని

నిన్న ఢిల్లీలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ రాజధాని అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఏపీ రాజధాని ఏదని గూగుల్ లో వెదికినా విశాఖ అనే చూపిస్తుందని అన్నారు. విశాఖపట్నం ఏపీ రాజధాని కాబోతోందని సీఎం జగన్ మంచి ప్రకటన చేశారని కొనియాడారు. సీఎం జగన్ నిర్ణయం అద్భుతంగా ఉందని ప్రజలు స్వాగతిస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. 

రాజధానికి ఉండవలసిన అన్ని హంగులు విశాఖకు ఉన్నాయని, కనెక్టివిటీ పరంగా విశాఖ అన్ని రకాలుగా అనుకూలమని తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. తాను కూడా విశాఖ వచ్చేస్తున్నానని స్వయంగా జగనే చెప్పారని, పారిశ్రామికవేత్తలు సైతం విశాఖపై ఆసక్తి చూపిస్తున్నారని వెల్లడించారు. 

నగరానికి విశాలమైన తీర ప్రాంతం ఉందని, విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ గా రూపుదిద్దుకోనుందని తెలిపారు.

More Telugu News