Adani: భారత బిలియనీర్ అదానీకి మద్దతుగా ట్విట్టర్ ట్రెండ్స్
- అదానీ వెంటే భారత్ అంటూ ట్రెండింగ్
- ఏ విదేశీ శక్తి ముందు భారత్ తలవంచదన్న ఓ యూజర్
- భారత్ ఎదుగుదలను చూసి ప్రపంచం భయపడుతోందంటూ ట్వీట్
అదానీ గ్రూప్ కు వ్యతిరేకంగా అమెరికాకు చెందిన స్పెక్యులేటివ్ ట్రేడింగ్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదిక విడుదల చేయగా, ఈ ప్రభావానికి అదానీ షేర్లు పడిపోవడం చూశాం. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలు, కల్పితాలని అదానీ గ్రూప్ కొట్టి పడేసింది. భారత వృద్ధి ఆకాంక్షలపై, భారత్ లోని ప్రపంచ స్థాయి కంపెనీలపై చేసిన దాడిగా దీన్ని పేర్కొంది. దీంతో ట్విట్టర్ లో అదానీకి మద్దతుగా ‘ఇండియా స్టాండ్స్ విత్ అదానీ’ పేరుతో ట్రెండింగ్ నడుస్తోంది.
ముఖ్యంగా ఒకవైపు హిండెన్ బర్గ్ తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ.. మరోవైపు అదానీ గ్రూపులో కీలకమైన అదానీ ఎంటర్ ప్రైజెస్ రూ.20,000 కోట్ల సమీకరణతో చేపట్టిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్ పీవో) పూర్తిగా సబ్ స్క్రైబ్ అయింది. దీంతో ట్విట్టర్లో పలువురు అదానీ గ్రూప్ కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. అదానీ గ్రూప్ పనితీరును సమర్థిస్తున్నారు. ‘‘బయటి వ్యక్తులు అదానీకి వ్యతిరేకంగా తుపాను సృష్టించినప్పటికీ భారతీయ వ్యాపార సమూహం అదానీ వెంటే ఉంటుంది. ఇండియా ఐఎన్సీ సపోర్ట్స్ అదానీ’ అంటూ హిమాన్షు హిర్పరా ట్వీట్ చేశారు.
‘‘భారత జీడీపీ వృద్ధి చెందుతుండడం, ప్రపంచ శక్తిగా మారుతుండడంతో ప్రపంచ అగ్రగామి దేశాలు భయపడుతున్నాయి’’ అని మరో యూజర్ ట్వీట్ చేశాడు. ‘‘నా దేశ బిలియనీర్ ను చూసి గర్వపడుతున్నాను. భారతీయులను మూర్ఖులను చేయలేరు. ఏ విదేశీ శక్తి ముందు భారత్ తలవంచదు’’ అని గుజరాత్ బీజేపీ ఐటీ యూనిట్ సభ్యుడు ముకంద్ జెతావా ట్వీట్ చేశారు.