Mamata Banerjee: నోబెల్ విజేత అమర్త్యసేన్ ను బీజేపీ ఈ విధంగా అవమానించడం సరికాదు: మమతా బెనర్జీ
- నోబెల్ విజేత అమర్త్యసేన్ పై భూ ఆక్రమణ ఆరోపణలు
- లేఖ రాసిన విశ్వభారతి వర్సిటీ యాజమాన్యం
- అమర్త్యసేన్ కు మద్దతుగా నిలిచిన సీఎం మమతా బెనర్జీ
- వర్సిటీ తీరును తప్పుబట్టిన వైనం
నోబెల్ విజేత, ప్రఖ్యాత ఆర్థికవేత్త అమర్త్యసేన్ భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటుండడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. అమర్త్యసేన్ కు ఆమె మద్దతుగా నిలిచారు. అమర్త్యసేన్ తమ భూమిని ఆక్రమించారంటూ విశ్వభారతి యూనివర్సిటీ ఆరోపిస్తోంది. ఆ భూమిని తిరిగి ఇచ్చేయాలంటూ వర్సిటీ యాజమాన్యం అమర్త్యసేన్ కు లేఖ రాసింది.
ఈ నేపథ్యంలో, బిర్భూమ్ లోని పూర్వీకుల ఇంట్లో ఉన్న అమర్త్యసేన్ ను మమతా బెనర్జీ కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమర్త్యసేన్ వంటి వ్యక్తిని బీజేపీ ఈ విధంగా అవమానించడం సరికాదని హితవు పలికారు.
"అమర్త్యసేన్ ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఇలాంటి ప్రయత్నాలు చేస్తారా? కాషాయీకరణ పోకడలకు పోకుండా, విశ్వభారతి యాజమాన్యం సరైన పంథాలో నడవాలని కోరుకుంటున్నాను" అని మమతా బెనర్జీ తెలిపారు.