Madhya Pradesh: ప్రభుత్వ ఉద్యోగి భార్యగా కావాలి.. కట్నం ఇచ్చుకుంటానంటూ ప్లకార్డుతో నిలబడ్డ యువకుడు.. అసలు విషయం ఏమిటంటే..!
- మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో ఓ యువకుడి వినూత్న ప్రయత్నం
- ప్లకార్డుపై కావాల్సిన భార్య అర్హతలు రాస్తూ నిలబడిన యువకుడు
- ఇదంతా వినోదం కోసమే చేసినట్టు తర్వాత వెల్లడి
ప్రభుత్వ ఉద్యోగి తమ అమ్మాయికి భర్తగా రావాలటూ సాధారణంగా అమ్మాయి తల్లిదండ్రులు అన్వేషణ చేస్తుంటారు. కానీ, ప్రభుత్వ ఉద్యోగి అయిన వధువు కోసం వెతికే వారు అరుదు. మధ్యప్రదేశ్ లోని చింద్వారా ప్రాంతానికి చెందిన వికల్ప్ మాల్వి రెండో కోవకు చెందిన వాడు. ఓ రోజు రద్దీగా ఉన్న ఫౌంటెయిన్ చౌక్ వీధిలో పెద్ద ప్లకార్డు పట్టుకుని నిలుచున్నాడు. పసుపు రంగు పేపర్ పై హిందీలో పెద్ద అక్షరాలతో విషయం రాసివుంది. దారిన పోయే వారందరూ దాని వైపు పరిశీలనగా చూసి నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఇంతకీ ఆ ప్లకార్డులో ఏముందని అనుకుంటున్నారు..? ‘‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నాకు కావాలి. వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి అమ్మాయికి నేను కట్నం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను’’ అని రాసి ఉంది. మంచి ఉద్యోగం చేస్తున్న అల్లుడు లభిస్తే కట్నం ఇచ్చేందుకు అమ్మాయి తల్లిదండ్రులు వెనుకాడరు. కానీ, తనకు నచ్చిన అమ్మాయి కోసం ఇతడు ఎదురు కట్నం ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే, విషయం ఏమిటంటే నిజంగా ప్రభుత్వ ఉద్యోగిని పెళ్లాడేందుకు వికల్ప్ మాల్వి ఈ పనిచేయలేదట. అందరినీ నవ్వించడం కోసం భిన్నంగా అలా చేశానని, తనను ప్రశ్నించిన వారికి చెప్పడంతో ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది. తరచూ ఇలా ఏదో ఒక వీడియో చేస్తుండడం అతడి వ్యాపకం.