Kamal Haasan: కాంగ్రెస్ కు మరింత దగ్గరవుతున్న కమలహాసన్
- ఈరోడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే ఉమ్మడి అభ్యర్థికి కమల్ మద్దతు
- జాతీయ ప్రయోజనాల కోణంలోనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటన
- తాను కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఎందుకు ఆశించరాదని ప్రశ్న
దక్షిణాది నటుడు కమలహాసన్ చూస్తుంటే కాంగ్రెస్ కు చేరువ కావాలనే ప్రయత్నంతో ఉన్నట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా.. గత నెలలో ఢిల్లీలో రాహుల్ తో కలసి కమల్ నడుస్తూ, ముచ్చటించడం తెలిసిందే. ఇప్పుడు తమిళనాడులోని ఈరోడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే ఉమ్మడి అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ కు కమల్ తన మద్దతు ప్రకటించారు.
కమలహాసన్ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అనే పార్టీని ఏర్పాటు చేసుకోవడం తెలిసిందే. 2018 ఫిబ్రవరిలో దీన్ని కమలహాసన్ ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన 2021 ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ తమిళనాడు వ్యాప్తంగా 2.62 శాతం ఓట్లను సంపాదించుకోగలిగింది. కానీ, ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. దీంతో కమల్ ఒంటరిగా తన బలం ఏ పాటిదో గుర్తించి ఉంటారు. అందుకే కాంగ్రెస్, డీఎంకే ఉమ్మడి అభ్యర్థికి మద్దతుకు ముందుకు వచ్చి ఉంటారన్న విశ్లేషణ రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. పైగా కమల్ బీజేపీని, బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు.
ఈరోడ్ స్థానంలో ఇళంగోవన్ కు మద్దతు ప్రకటించడం పట్ల మీడియా నుంచి కమలహాసన్ కు ప్రశ్నలు ఎదురయ్యాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నారా? అని అడగ్గా.. కాంగ్రెస్ పార్టీ నుంచి తాను ఎంపీ టికెట్ ను ఎందుకు ఆశించరాదు? అని కమల్ ఎదురు ప్రశ్నించారు. జాతీయ ప్రయోజనాల కోణంలోనే తాను ఈ నిర్ణయం (మద్దతు ఇవ్వడం) తీసుకున్నట్టు సమర్థించుకున్నారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. జాతీయ ప్రయోజనాల విషయానికొస్తే పార్టీ సిద్ధాంతాలను సైతం పక్కన పెట్టాల్సిందేనన్నారు. ఏక సంస్కృతికి తాను వ్యతిరేకిని అని, బహుళత్వమే భారత్ దేశాన్ని భిన్నంగా నిలబెట్టిందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు.