air india: ‘ఇంకొక్క డ్రింక్ ఇవ్వండి.. ప్లీజ్’ అని ఇబ్బంది పెట్టొద్దు !: కస్టమర్లకు ఎయిర్ ఇండియా విజ్ఞప్తి

In New Air India Alcohol Rules Tactfully Refusing To Further Serve

  • విమానంలో మద్యం అందించే విషయంపై రూల్స్ సవరించిన సంస్థ
  • పరిమితి దాటితే ప్రయాణికుడు అడిగినా మద్యం ఇవ్వొద్దని సిబ్బందికి సూచన
  • ఆ విషయాన్ని మర్యాదగా చెప్పాలని క్యాబిన్ సిబ్బందికి హితవు
  • మద్యం తెచ్చుకుని తాగే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని హెచ్చరిక

విమాన ప్రయాణంలో మద్యం అందించే విధానంపై ఎయిర్ ఇండియా కొన్ని మార్పులు చేసింది. నిబంధనల్లో మార్పులు చేర్పులు చేస్తూ.. మితిమీరి తాగే వారిని ఓ కంట కనిపెడుతూ వారికి మద్యం సర్వ్ చేయడం కుదరదని మర్యాదగా చెప్పాలని తమ సిబ్బందికి సూచించింది. అదేవిధంగా కొంతమంది మద్యం బాటిళ్లు వెంట తెచ్చుకుని సేవిస్తుంటారని, అలాంటి ఘటనల్లో వారికి మర్యాదగా రూల్స్ గురించి చెప్పి, ఆ బాటిళ్లు తీసేసుకోవాలని పేర్కొంది. 

ఇటీవల తమ విమానాల్లో జరిగిన ఘటనలు, వాటిపై డీజీసీఏ రూ.40 లక్షల జరిమానా విధించిన నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సిబ్బందికి ఈ కొత్త రూల్స్ జారీ చేసింది. అదే సమయంలో ‘ఇంకొక్క లాస్ట్ డ్రింక్ ఇవ్వండి’ అంటూ విమాన సిబ్బందిని ఇబ్బంది పెట్టొదంటూ ప్రయాణికులకు సూచించింది.

అంతర్జాతీయ ప్రయాణికులకు విమానంలో మద్యం అందించే పద్ధతి చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రయాణికులకు ఎంత మోతాదులో సర్వ్ చేయొచ్చు, ఎవరెవరికి సర్వ్ చేయొచ్చు.. తదితర వివరాలతో రూల్స్ కూడా ఉన్నాయి. ఈ రూల్స్ కు ఎయిర్ ఇండియా తాజాగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంది. జనవరి 19న తమ కస్టమర్లకు మద్యం సర్వ్ చేసే విషయంలో సిబ్బందికి కీలక సూచనలు చేసింది. నిబంధనల ప్రకారం డ్రింక్స్ సర్వ్ చేశాక ఇంకొక్క డ్రింక్ అంటూ ఇబ్బంది పెట్టే ప్రయాణికులతో మర్యాదగా, అదే సమయంలో స్పష్టంగా ఇక మద్యం ఇవ్వలేమని చెప్పాలని పేర్కొంది.

మద్యం అందించే విషయంలో ప్రయాణికులతో వాదనకు దిగొద్దని, వారిని తాగుబోతులని సంబోధించవద్దని ఎయిర్ ఇండియా తన సిబ్బందిని హెచ్చరించింది. ప్రయాణంలో అనుమతించిన మేరకు డ్రింక్ సర్వ్ చేసినట్లు అతిథులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించింది. లిమిట్ క్రాస్ చేయడం వల్ల మిగతా ప్రయాణికులు ఇబ్బంది పడతారని గుర్తుచేయాలని పేర్కొంది. ఈమేరకు అమెరికా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ మార్గదర్శకాలు, ఇతర విమానయాన సంస్థలలో అమలవుతున్న నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ఎయిర్ ఇండియా విమానాల్లో మద్యం సర్వ్ చేయడంపై నిబంధనలను సవరించినట్లు ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.

More Telugu News