SS Rajamouli: ఇంతకంటే ఇంకేమీ అడగను: రాజమౌళి

SS Rajamouli reaction after Naatu Naatu song gets Oscar nomination

  • నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్
  • ఉప్పొంగిపోతున్న రాజమౌళి
  • ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి, అభిమానులకు కృతజ్ఞతలు
  • ఎన్టీఆర్, చరణ్ మధ్య సమన్వయానికి కితాబు

తాను దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ (ఒరిజినల్ సాంగ్) లభించడం పట్ల ఎస్ఎస్ రాజమౌళి సంతోషంతో పొంగిపోతున్నారు. తన ఆనందాన్ని ఓ ప్రకటన రూపంలో వెల్లడించారు. 

"నా సినిమాలో మా పెద్దన్న (కీరవాణి) తన పాటకు గాను ఆస్కార్ నామినేషన్ పొందారు. ఇంతకంటే ఇంకేం కావాలి? ఇప్పుడు నేను తారక్, చరణ్ లను మించిపోయేలా వీరలెవల్లో నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తున్నాను. 

చంద్రబోస్ గారూ కంగ్రాచ్యులేషన్స్... ఆస్కార్ వేదిక మీద మన పాట వినిపిస్తోంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్.. ఈ పాట కోసం మీ కృషి అమూల్యం. మీకు నా వ్యక్తిగత ఆస్కార్ ఇచ్చేస్తాను. 

ఈ పాట విషయంలో చాలాకాలంగా సందిగ్ధంలో ఉన్న నాకు భైరవ బీజీఎం ఎంతో భరోసా అందించింది. ఈ పాటను మరింత ముందుకు తీసుకెళ్లవచ్చన్న నమ్మకం కలిగించింది. థాంక్యూ భైరి బాబు. 

ఇక ఈ పాట ఈ స్థాయికి రావడానికి ప్రధాన కారణాలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య సమన్వయం, స్టయిల్. తమదైన శైలిలో వారు చేసిన డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకింది. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ వేళ నేను పెట్టిన హింసకు వారిద్దరినీ క్షమాపణ కోరుతున్నా. చాన్స్ దొరికితే వాళ్లిద్దరినీ మరోసారి ఆడుకోవడానికి నేను వెనుకాడనండోయ్! 

అసలు నేనెప్పుడూ ఆస్కార్ వరకు వెళతానని అనుకోలేదు. ఇదంతా నాటు నాటు పాటకు, ఆర్ఆర్ఆర్ కు ఉన్న అభిమానుల వల్లే సాధ్యమైంది. వారి అభిమానం చూసిన తర్వాత ఈ పాటను ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మా మనసుల్లో కలిగింది. వీరాభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు. 

ఈ సందర్భంగా కార్తికేయ గురించి చెప్పుకోవాలి. అలుపెరగకుండా, పని రాక్షసుడిలా వ్యవహరించిన కార్తికేయ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. నీ పట్ల గర్విస్తున్నాను కార్తికేయ. 

ఇక సోషల్ మీడియాలో రోజులో 24 గంటలూ ఆర్ఆర్ఆర్ కు, నాటు నాటు పాటకు ప్రచారం కల్పించడంలో కృషి చేసిన ప్రదీప్, హర్ష, చైతన్యలకు కృతజ్ఞతలు. ఆస్కార్ కు మరొక్క అడుగుదూరంలో ఉన్నాం... థాంక్యూ!" అంటూ రాజమౌళి పేర్కొన్నారు.

More Telugu News