kapil dev: సచిన్, కోహ్లీలో ఎవరు గొప్ప?.. ‘యార్కర్’ లా కపిల్ దేవ్ స్పందన
- ప్రతి తరంలో అత్యుత్తమ ఆటగాళ్లు వస్తారన్న క్రికెట్ లెజెండ్
- ఒక్క ఆటగాడి గురించే ప్రత్యేకంగా చెప్పలేమని వెల్లడి
- 11 మంది కలిస్తేనే జట్టు అవుతుందని వ్యాఖ్య
‘బ్రాడ్ మన్, సచిన్ లలో ఎవరు గొప్ప బ్యాట్స్ మన్?’... దశాబ్దం కిందటి వరకు ఎక్కువగా వినిపించిన ప్రశ్న ఇది.
‘సచిన్, కోహ్లీలలో ఎవరు బెస్ట్ బ్యాటర్?’... ఇది ఇప్పుడు తరచూ ఎదురవుతున్న ప్రశ్న.
గల్ఫ్ న్యూస్‌తో ఇంటర్వ్యూ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. అసలే యార్కర్లు సంధించిన వెటరన్ కదా.. టిపికల్ కపిల్ నుంచి సమాధానం కూడా యార్కర్ లానే వచ్చింది.
‘‘మీరు ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయలేరు. 11 మంది కలిస్తేనే జట్టు. అందుకే ఒక్క ఆటగాడి గురించే ప్రత్యేకంగా చెప్పలేం. నాకు సొంతంగా ఇష్టాలు, అయిష్టాలు ఉండొచ్చు. ప్రతి తరం మెరుగవుతూనే ఉంటుంది. మా కాలంలో సునీల్ గవాస్కర్.. తర్వాత రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్.. ప్రస్తుత తరంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నారు. తర్వాతి తరంలో మనం మరింత మంది అత్యుత్తమ ఆటగాళ్లను చూస్తాం.. వారి నుంచి మంచి ప్రదర్శనను వీక్షిస్తాం’’ అని ఈ క్రికెట్ లెజెండ్ చెప్పుకొచ్చారు.