Budda Venkanna: లోకేశ్ పాదయాత్రకు సీఎం అనుమతి అవసరంలేదు: బుద్ధా వెంకన్న
- జనవరి 27 నుంచి యువగళం
- సుదీర్ఘ పాదయాత్ర చేపడుతున్న నారా లోకేశ్
- అనుమతులపై కొనసాగుతున్న అనిశ్చితి
- అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్న బుద్ధా వెంకన్న
- లోకేశ్ పాదయాత్ర రక్షణ పోలీసుల బాధ్యత అన్న కేశినేని చిన్ని
మరో నాలుగు రోజుల్లో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో టీడీపీ నేతలు మాటల్లో పదును పెంచారు. లోకేశ్ పాదయాత్రకు సీఎం అనుమతి అవసరంలేదని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. గతంలో జగన్ ఏమైనా అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నించారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎంత అసాధ్యమో, లోకేశ్ పాదయాత్రను అపడం కూడా అంతే అసాధ్యం అని బుద్ధా వెంకన్న స్పష్టం చేశారు.
టీడీపీ ఎంపీ కేశినేని నాని సోదరుడు కేశినేని చిన్ని ఇదే అంశంపై స్పందించారు. లోకేశ్ పాదయాత్రను ఆపడం ఎవరి వల్లా కాదని అన్నారు. పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తే చూస్తూ ఊరుకోం అని హెచ్చరించారు. పాదయాత్ర నిర్వహిస్తున్నామని పోలీసు శాఖకు సమాచారం ఇచ్చామని, ఇక ఎవరి అనుమతులు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. లోకేశ్ పాదయాత్రకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని కేశినేని చిన్ని స్పష్టం చేశారు.