Australia: ఆలయ గోడలపై విద్వేష రాతలు.. ఆస్ట్రేలియాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీ మద్దతుదారులు
- ఉగ్రవాదిని అమరవీరుడిగా కీర్తిస్తూ నినాదాలు
- రెండు వారాల వ్యవధిలో మూడు ఆలయాలపై ఇదేరకం దాడి
- ఆలయాలపై దాడులను ఖండించిన భారత విదేశాంగ శాఖ
ఆస్ట్రేలియాలో ఖలిస్థానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. హిందూ ఆలయాలపై దాడి చేస్తున్నారు. గోడలపై విద్వేష రాతలతో కలకలం సృష్టిస్తున్నారు. భారత ప్రధాని మోదీకి, హిందువులకు వ్యతిరేకంగా నినాదాలు రాస్తున్నారు. రెండు వారాల వ్యవధిలో మూడు ఆలయాలపై ఇలా దాడి జరిగింది. తాజాగా, మెల్ బోర్న్ లోని అల్బర్ట్ పార్క్ దగ్గర్లో ఉన్న గుడి గోడలపైన సోమవారం ఈ విద్వేష రాతలు దర్శనమిచ్చాయి. హిందుస్థాన్ ముర్దాబాద్, ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ దుండగులు గోడలపైన పెయింట్ తో రాశారు. మోదీకి వ్యతిరేకంగా స్లోగన్లు కూడా రాశారు.
ఉగ్రవాది బింద్రన్ వాలేను అమరవీరుడిగా కీర్తిస్తూ ఆలయ గోడలపై రాసిన ఘటనల్లో ఇది మూడవది.. గతంలో శ్రీ శివ విష్ణు ఆలయ గోడలపైన, స్వామినారాయణ్ గుడి గోడలపైనా ఇలాంటి నినాదాలు ప్రత్యక్షమయ్యాయి. ఈ ఘటనలపై ఆస్ట్రేలియాలోని హిందువులలో ఆందోళన వ్యక్తమవుతోంది. మన దేశంలోని ఆస్ట్రేలియా రాయబారి స్పందిస్తూ.. ఆస్ట్రేలియా భిన్న సంస్కృతులకు ఆలవాలమైన దేశమని, ఇలాంటి సంఘటనలకు దేశంలో చోటులేదని అన్నారు.
భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ఎంతో ప్రాధాన్యమిస్తామని, అయితే, ఇలాంటి విద్వేష రాతలను ఎంతమాత్రమూ సహించబోమని ఆస్ట్రేలియా రాయబారి స్పష్టం చేశారు. కాగా, హిందూ ఆలయాలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి ఓ ప్రకటన విడుదల చేశారు.