Pakistan: ఇకపై మహ్మద్ ప్రవక్త సంబంధీకులను అవమానించినా పాక్లో కఠిన శిక్షలు!
- దైవదూషణ చట్టాన్ని కఠినతరం చేసిన పాక్
- సవరించిన చట్టాన్ని ఆమోదించిన పార్లమెంట్
- ఈ చట్టం కింద కేసు నమోదైతే బెయిలు అవకాశం లేనట్టే
- శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా
దైవదూషణ చట్టానికి పాక్ ప్రభుత్వం మరింత పదును పెట్టింది. ఇస్లాంను కానీ, మహ్మద్ ప్రవక్తను కానీ నిందించిన వారికి ప్రస్తుతం కఠిన శిక్షలు అమలు చేస్తుండగా ఇకపై మహ్మద్ ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఈ మేరకు చట్టాన్ని సవరిస్తూ ప్రవేశపెట్టిన చట్టానికి పార్లమెంటు ఆమోదం లభించింది.
సవరించిన చట్టం ప్రకారం.. మహ్మద్ ప్రవక్త భార్యలపై, సహచరులపై, దగ్గరి బంధువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పదేళ్ల జైలు శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, దానిని జీవిత ఖైదుగా కూడా మార్చే అవకాశం ఉంది. శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. దైవదూషణ కేసు నమోదైతే బెయిలు పొందే అవకాశం ఉండదు. మహ్మద్ ప్రవక్త బంధువులను విమర్శించిన వారికి ఇప్పటి వరకు ఎలాంటి శిక్షలు లేవు. ఈ నేపథ్యంలోనే చట్టాన్ని సవరించినట్టు ప్రభుత్వం తెలిపింది. అయితే, మానవ హక్కుల సంఘాలు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు దీనిని ఉపయోగించుకుంటున్నారని మండిపడుతున్నాయి.