Narmada valley: 256 డైనోసార్ గుడ్లు... ఎక్కడో తెలుసా?
- మధ్యప్రదేశ్ లోని నర్మద వ్యాలీలో కనుగొన్నపరిశోధకులు
- 6.6 కోట్ల సంవత్సరాల కిందటివని గుర్తింపు
- పొడవాటి మెడతో ఉండే శాకాహార టైటానోసార్ ల గుడ్లేనని అంచనా
మనిషి పుట్టకముందే డైనోసార్లు అంతమైపోయాయి. సినిమాల పుణ్యమా అని అవి ‘ఇలా ఉండేవి’ అని తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఎన్నో వేల ఏళ్ల కిందట డైనోసార్లు కనుమరుగైనా.. వాటి ఆనవాళ్లు ఇప్పటికీ ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని నర్మద లోయలో డైనోసార్ల గుడ్లు బయటపడ్డాయి. ఒకటో రెండో కాదండోయ్... ఏకంగా 256 గుడ్లు!!
ఢిల్లీ యూనివర్సిటీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ పరిశోధకులు వీటిని కనుగొన్నారు. ఈ గుడ్లు దాదాపు 6.6 కోట్ల సంవత్సరాల కిందట జీవించిన డైనోసార్లవిగా గుర్తించారు. మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో బాగ్, కుక్షి ఏరియాల్లో జరిపిన తవ్వకాల్లో మల్టీ షెల్ ఎగ్స్ ను వెలికితీశారు.
పొడవాటి మెడతో ఉండే శాకాహారులైన టైటానోసార్ లకు చెందిన 256 గుడ్లు, గూళ్లు ఇందులో ఉన్నాయి. పొదగడానికి అనువైన పరిస్థితులు లేనప్పుడు తల్లి తన గుడ్లను కడుపులోనే ఉంచుకోవడంతో పెంకు మీదు పెంకు ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. నర్మదా వ్యాలీలో వీటి గూళ్లు కూడా చాలా దగ్గరగా ఉన్నట్లు వారు గుర్తించారు. పీఎల్ఓఎస్ జర్నల్ లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి.