Nara Lokesh: లోకేశ్ యువగళం పాదయాత్రపై మరిన్ని వివరాలు కోరిన డీజీపీ కార్యాలయం

DGP office seeks more details on Nara Lokesh Yuvagalam Padayatra

  • ఈ నెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
  • పోలీసు శాఖ అనుమతి కోరుతూ టీడీపీ లేఖ
  • ఇటీవల రిమైండర్ కూడా పంపిన వర్ల రామయ్య
  • తాజాగా ప్రత్యుత్తరం ఇచ్చిన డీజీపీ కార్యాలయం 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి సుదీర్ఘ పాదయాత్ర చేపడుతుండడం తెలిసిందే. ఆ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న డీజీపీకి లేఖ రాశారు. పోలీసు శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో, రిమైండర్ లేఖను కూడా పంపారు. ఈ నేపథ్యంలో, ఏపీ పోలీస్ విభాగం స్పందించింది. లోకేశ్ పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు అందజేయాలని డీజీపీ కార్యాలయం టీడీపీని కోరింది.

  • లోకేశ్ పాదయాత్ర ఏ జిల్లాలో ఎప్పుడు, ఎక్కడ కొనసాగుతుందో సమయం, ప్రాంతం, తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్ సమర్పించాలి.
  • జిల్లాల్లో లోకేశ్ పాదయాత్ర సాగే సమగ్ర రూట్ మ్యాప్ ఇవ్వాలి.
  • పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు? వారందరి వివరాలు అందజేయాలి.
  • పాదయాత్రలో ఏ ఏ రకం వాహనాలు వినియోగిస్తారు? వాటి నెంబర్లు, నెంబర్ ప్లేట్ వివరాలు, ఇతర అంశాలను సమర్పించాలి.
  • పాదయాత్రలో రాత్రి బస చేసే ప్రాంతాల పేర్లు, జిల్లాల వారీగా స్థానిక ఫోన్ నెంబర్లు ఇవ్వాలి.

ఈ వివరాలను రేపు (జనవరి 22) ఉదయం 11 గంటలకు డీజీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై కానీ, లిఖితపూర్వకంగా కానీ అందించవచ్చని పోలీసు శాఖ టీడీపీకి పంపిన ప్రత్యుత్తరంలో స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News