Atchannaidu: లోకేశ్ యువగళం ప్రారంభానికి ముందే దాడులకు పథకం సిద్ధం చేశారు: అచ్చెన్నాయుడు
- ఈ నెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
- దాడులపై వాట్సాప్ సందేశాలు పంపుతున్నారన్న అచ్చెన్న
- బరితెగించారంటూ ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో యువగళం పేరిట పాదయాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలో, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం కావడానికి ముందే, దాడులకు పథకం సిద్ధం చేశావా జగన్ రెడ్డీ? అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
పాదయాత్రపై దాడులు చేయండి అంటూ శాంతిపురం ఎంపీపీ, వైసీపీకి చెందిన కోదండరెడ్డి కుప్పం నియోజకవర్గ వాట్సాప్ గ్రూపుల్లో హింసను ప్రేరేపించే విధంగా పబ్లిగ్గా మెసేజ్ లు పంపే స్థాయికి బరితెగించాడంటే కచ్చితంగా నీ హస్తం, మంత్రి పెద్దిరెడ్డి హస్తం ఉన్నట్టే భావించాలా? అంటూ సీఎం జగన్ ను ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దీనిపై, ఆ మెసేజ్ లు పంపిన వ్యక్తిపై ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది కూడా చూస్తాం అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.