pune: మహారాష్ట్రలో అమానుషం.. సంతానం కోసం శ్మశానంలో ఎముకల పొడి తినిపించారు

Woman Forced To Eat Powdered Human Bones To Conceive Child
  • మహిళపై దారుణాలకు పాల్పడిన భర్త, అతడి తమ్ముళ్లు
  • చేతబడులు, క్షుద్ర, అఘోరా పూజలు 
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • ఏడుగురిపై కేసు నమోదు
ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడటం లేదు. క్షుద్రపూజలు, చేతబడుల పేరుతో జరుగుతున్న అమానుషాలు ఏదో ఒక చోట తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. పిల్లలు పుడతారని కుటుంబ సభ్యులే ఓ మహిళకు మనిషి ఎముకల పౌడర్ ను తినిపించారు. మరెన్నో వికృత చేష్టలకు పాల్పడ్డారు.

ఈ కేసు వివరాలను పూణె సిటీ పోలీసు డిప్యూటీ క‌మిష‌న‌ర్ సుశైల్ శ‌ర్మ వెల్ల‌డించారు. పూణె ప్రాంతానికి చెందిన బాధితురాలు తన అత్తింటి వారిపై రెండు ఫిర్యాదులు చేసినట్లు తెలిపారు. అమావాస్య రాత్రుల వేళ శ్మశానాల‌కు తనను తీసుకువెళ్లేవార‌ని, అక్కడ అస్థికలను తినిపించేవార‌ని ఆమె తన ఫిర్యాదులో చెప్పింది. చేతబడి చేసే వ్యక్తి చెప్పడంతో అలా చేశారని తెలిపింది. మ‌హారాష్ట్ర‌లోని కొంక‌ణ్ ప్రాంతానికి తీసుకువెళ్లి అఘోరా పూజ‌లు చేయించిన‌ట్లు తెలిపింది. ఓ జ‌ల‌పాతం కింద చేతబడి చేయించిన‌ట్లు చెప్పింది. మాంత్రికుడు వీడియో కాల్ చేసి సూచనలు చేసే వాడని వివరించింది.

2019లో పెళ్లి స‌మ‌యంలో భ‌ర్త‌, అతడి తమ్ముళ్లు క‌ట్నం డిమాండ్ చేసిన‌ట్లు ఇంకో ఫిర్యాదు చేసింది. నిందితులంతా బాగా చదువుకున్న‌వాళ్లేనని, కానీ క్షుద్ర ప‌ద్ధ‌తుల్ని అనుస‌రించారని పోలీసులు చెప్పారు. బాధితురాలి భర్త, అతడి తమ్ముళ్లు, చేతబడులు చేయించిన వ్యక్తి సహా ఏడుగురిపై పలు సెక్ష‌న్ల కింద కేసు బుక్ చేసిన‌ట్లు చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.
pune
black magic
Human Bones
crematorium

More Telugu News