Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన... ముగ్గురి ఆచూకీ గల్లంతు
- రాంగోపాల్ పేట పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో అగ్నిప్రమాదం
- 12 గంటల పాటు ఎగసిపడిన అగ్నికీలలు
- 22 ఫైరింజన్లతో శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
- పలువురిని కాపాడిన అధికారులు
- బీహార్ కూలీలు చిక్కుకుపోయినట్టు భావిస్తున్న అధికారులు
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తుల ఆచూకీ తెలియరాలేదు. నిన్న డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం జరగడం తెలిసిందే. 22 ఫైరింజన్లతో దాదాపు 12 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. అప్పటికే భవనం దాదాపు పూర్తిగా కాలిపోయింది.
ఈ భవనం నుంచి అగ్నిమాపక సిబ్బంది పలువురిని కాపాడగా... బీహార్ కు చెందిన కూలీలు వసీమ్, జునైద్, జహీర్ ల ఆచూకీ గల్లంతైంది. వారి సెల్ ఫోన్ లొకేషన్ కాలిపోయిన బిల్డింగ్ నే సూచిస్తుండడంతో వారు సజీవంగా ఉండే అవకాశాలు తక్కువని భావిస్తున్నారు. ఇవాళ కాలిపోయిన భవనం పరిశీలనకు అధికారులు డ్రోన్ ను పంపించగా, దగ్ధమైన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.
డెక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనంలో ఇంకా అమితమైన వేడిగా ఉండడంతో అక్కడికి ఎవరూ వెళ్లలేకపోతున్నారు. కాగా, నిన్నటి సహాయక చర్యల్లో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అస్వస్థతకు గురికాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.