Shubman Gill: క్రికెట్‌కు గిల్ లాంటి ఆటగాడు కావాలి: పాక్ మాజీ కెప్టెన్
- కివీస్‌పై డబుల్ సెంచరీ సాధించిన గిల్
- గిల్ ఇలాగే ఆడితే అద్భుతాలు సృష్టిస్తాడన్న సల్మాన్ భట్
- దిగ్గజాల స్పర్శను కోల్పోతున్న క్రికెట్‌కు గిల్ అవసరం ఉందని వ్యాఖ్య
న్యూజిలాండ్‌తో హైదరాబాద్‌లో జరిగిన వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన టీమిండియా ఓపెనర్ శుభమన్ గిల్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ద్విశతకం సాధించిన అతి పిన్న వయస్కుడిగా గిల్ రికార్డులకెక్కాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ తాజాగా తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ.. శుభమన్ గిల్ లాంటి ఆటగాడి అవసరం క్రికెట్‌కు ఉందన్నాడు. గిల్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా మారతాడన్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు చాంపియన్‌షిప్‌లో గిల్ ఆట చూశాక అతడి అభిమానిగా మారిపోయానన్న భట్.. స్ట్రోక్స్‌లో అతడి శైలి అద్భుతమని కొనియాడాడు. ఇంత నైపుణ్యం ఉన్న ఆటగాడు పెద్ద స్కోర్లు ఎందుకు సాధించలేకపోతున్నాడా? అని అనుకునే వాడినని, కానీ కివీస్‌తో మ్యాచ్‌లో భిన్నమైన ఆటతీరు కనబరిచాడని ప్రశంసించాడు. ఈ వయసులో అతికొద్ది మాత్రమే ఇలా ఆడతారని, అందులో గిల్ ఒకడని అన్నాడు. అతడు అన్నీ సాధించేశాడని తాను చెప్పడం లేదని, కాకపోతే ఇదే ఆటతీరుతో ముందుకు సాగితే మాత్రం భవిష్యత్తులో దిగ్గజ ఆటగాడిగా మారడం ఖాయమన్నాడు.
న్యూజిలాండ్‌పై తన ఆటతీరుతో తాను పవర్ హిట్టర్‌ను మాత్రమే కాదని, బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ను కూడా ఆడగలనని గిల్ చాటిచెప్పాడని సల్మాన్ భట్ అన్నాడు. సచిన్ టెండూల్కర్, మార్క్ వా, సయీద్ అన్వర్, జాక్వెస్ కలిస్ లాంటి ఆటగాళ్ల స్పర్శను కోల్పోతున్న ఈ రోజుల్లో గిల్ లాంటి వారి అవసరం క్రికెట్‌కు ఉందని తేల్చి చెప్పాడు. బ్యూటీని కోల్పోతున్న క్రికెట్‌కు గిల్ నిజమైన బ్యూటీని ఆపాదించిపెట్టాడని పేర్కొన్నాడు.