Fire Accident: సికింద్రాబాద్ డెక్కన్ స్టోర్స్ లో భారీ అగ్నిప్రమాదం... ఘటనాస్థలికి చేరుకున్న తలసాని

Huge fire accident in Secunderabad

  • రాంగోపాల్ పేట పరిధిలో డెక్కన్ స్పోర్ట్స్ వేర్ లో మంటలు
  • మూడు గంటలుగా సహాయకచర్యలు
  • పర్యవేక్షిస్తున్న మంత్రి తలసాని
  • పలువురిని కాపాడినట్టు వెల్లడి

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పరిధిలోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ స్టోర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పక్కనే ఉన్న ఇతర భవనాలకు కూడా వ్యాపించాయి. ఘటనస్థలంలో దట్టమైన పొగ అలముకుంది. ఈ స్పోర్ట్స్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటీన అక్కడికి చేరుకున్నారు. 

ఈ స్టోర్ మొదటి అంతస్తులో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోగా, స్కైలిఫ్ట్ సాయంతో వారిని సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు. గత మూడు గంటలుగా ఇక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 

ఈ అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని వెల్లడించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని, ఇప్పటికే పలువురిని కాపాడారని తెలిపారు. మరో ఇద్దరిని కాపాడాల్సి ఉందని అన్నారు. వారి ఫోన్ల నుంచి స్పందన రావడంలేదని వివరించారు. 

ఈ భవనంలో క్లాత్ మెటీరియల్ పెద్ద ఎత్తున నిల్వ ఉండడంతో భారీ స్థాయిలో మంటలు వచ్చాయని, అందుకే మంటలను కట్టడి చేయడం కష్టమవుతోందని వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, ఈ స్టోర్ యజమాని ఆసుపత్రిలో ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. ఈ అగ్నిప్రమాదం దురదృష్టకరమని తెలిపారు.

Fire Accident
Deccan Store
Secunderabad
Talasani
Telangana
  • Loading...

More Telugu News