NTR: నేను ఎక్కడికి వెళ్లినా ఎన్టీఆర్ నాడు చెప్పిందే చెబుతుంటా: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Says that He often says what NTR Said

  • విశాఖలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం
  • దర్శకుడు కె.రాఘవేంద్రరావు, జయప్రద, జయసుధ, బ్రహ్మానందం హాజరు
  • ఎన్టీఆర్ శతజయంతి పురస్కారాలు అందుకున్న రాఘవేంద్రరావు, జయసుధ, జయప్రద
  • వేమూరి బలరామ్‌కు ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ సాహిత్య పురస్కారం
  • ఎన్టీఆర్‌తో నటించాలన్న కోరిక అలా తీరిందన్న బ్రహ్మానందం

రాజకీయాల్లో ఎన్టీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు అన్నారు. విశాఖపట్టణంలోని వుడా బాలల ప్రాంగణంలో నిన్న ‘లోక్ నాయక్ ఫౌండేషన్’ నిర్వహించిన ‘ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం’ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఉచితంగా ఇవ్వడం కాదని, వారికి చేయూత ఇవ్వాలని ఎన్టీఆర్ చెబుతుండేవారని, తానెక్కిడికి వెళ్లినా ఇదే విషయాన్ని చెబుతుంటానని అన్నారు. ప్రస్తుత రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పాలనలో ఎన్టీఆర్ సంస్కరణలకు నాంది పలికారని అన్నారు. తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని వెంకయ్య గుర్తుచేసుకున్నారు. 

ఈ సందర్భంగా ‘లోక్‌నాయక్ ఫౌండేషన్’ సాహిత్య పురస్కారాన్ని స్వాతి వారపత్రిక ఎడిటర్ వేమూరి బలరామ్‌కు, ఎన్టీఆర్ శతజయంతి పురస్కారాలను ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, సినీ తారలు జయసుధ, జయప్రదలకు అందజేశారు. సిలికానాంద్ర యూనివర్సిటీ వ్యవస్థాపకుడు కూచిభొట్ల ఆనంద్, కేఎల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ, జీఎస్ఎల్ వైద్య కళాశాల చైర్మన్ గన్ని భాస్కరరావులకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. 

అవార్డు అందుకున్న జయప్రద మాట్లాడుతూ.. ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయం అని పిలుపునిచ్చిన ఎన్టీఆర్ మహావ్యక్తి అని కొనియాడారు. వెంకయ్యనాయుడి ప్రసంగాలు అద్భుతంగా ఉంటాయని, ఆయనను చూస్తుంటే తనకు ఎస్వీఆర్ గుర్తొస్తారని జయసుధ అన్నారు. ఎన్టీఆర్‌తో నటించే అవకాశం రాలేదన్న బాధ తనకు ఉండేదని, అయితే మేజర్ చంద్రకాంత్ సినిమాలో రిక్షావాడి పాత్రతో ఆ లోటు తీరిందని హాస్యనటుడు బ్రహ్మానందం అన్నారు. కాగా, రాజమహేంద్రవరానికి చెందిన ఎ.రామకృష్ణ ఎన్టీఆర్‌పై రాసిన ‘ఈ శతాబ్ది హీరో, నాయకుడు, కథానాయకుడు’ అనే పుస్తకాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.

More Telugu News