Byreddy Siddharth Reddy: ఏపీలో బీఆర్ఎస్ ఏం చేస్తుందో చూద్దాం: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి

Byreddy Siddrath Reddy comments on BRS

  • జగన్ కు తెలంగాణలోనూ అభిమానులు ఉన్నారన్న సిద్ధార్థ్ రెడ్డి
  • ఆ ఉద్దేశంతోనే ప్రైవేటు సైన్యం ఉందని చెప్పినట్టు వెల్లడి
  • అధికారంలో లేకపోయినా జగన్ కోసం తపిస్తారని వ్యాఖ్యలు

వైసీపీ యువనేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై స్పందించారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఏంచేస్తుందో చూద్దాం అని అన్నారు. తెలంగాణలో వైఎస్ జగన్ ప్రవేశిస్తే అక్కడి రాజకీయాల్లో ప్రకంపనలు వస్తాయని వ్యాఖ్యానించారు. 

"వైఎస్ జగన్ అధికారంలో ఉన్నా, లేకపోయినా ఆయన కోసం స్పందించే కోట్లాది హృదయాలు ఉన్నాయి... ఆ దృష్టితోనే నేను జగన్ కు ప్రైవేటు సైన్యం ఉందని వ్యాఖ్యానించాను. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ జగన్ అభిమానులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, పొడిచేస్తుంది, చించేస్తుంది అంటూ తెలంగాణ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. వాళ్లు ఇక్కడికి వచ్చి ఏం చించుతారో, ఏం పొడుస్తారో తెలీదు కానీ... జగన్ సార్ తెలంగాణ రాజకీయాల్లో వేలుపెడితే మాత్రం అక్కడి ప్రభుత్వాలే తలకిందులవుతాయి" అని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇక, ఇటీవల శ్రీకాకుళం జిల్లా రణస్థలం సభలో హైపర్ ఆది చేసిన వ్యాఖ్యలపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పందించారు. పవన్ కల్యాణ్ కు కనీసం 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా? అని ప్రశ్నించారు. హైపర్ ఆది లాంటి వాళ్లు తాము ఎలాంటి నాయకుల కింద పనిచేస్తున్నామో గుర్తించాలని అన్నారు. మా పార్టీలో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ ను బూతులు తిట్టి, ఇప్పుడు పవన్ కల్యాణ్ పార్టీలోకి వెళ్లి మమ్మల్ని బూతులు తిట్టేవాళ్లను కూడా చూశాం అని పేర్కొన్నారు. 

అయితే హైపర్ ఆదిని గానీ, ఆ పార్టీకి చెందిన ఇతర వ్యక్తులను గానీ తప్పుబట్టనని, ఆ పార్టీ నాయకత్వాన్నే తప్పుబడతానని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి స్పష్టం చేశారు. అది కూడా పవన్ కల్యాణ్ ను మాత్రమే తప్పుబడుతున్నానని అన్నారు. 

"పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఏందిరా అంటే... రంగం అని తమిళ్ డబ్బింగ్ సినిమా ఒకటుంది. పవన్ ఆ సినిమాలో విలన్ లాంటోడు. రంగం సినిమాలో విలన్ బయటికేమో ఉద్యమం అంటాడు, పోరాటం అంటాడు... లోపలేమో ఉగ్రవాదులతో పొత్తుపెట్టుకుని ఉంటాడు. పవన్ కల్యాణ్ కూడా అంతే. పొద్దున లేస్తే ఉద్యమం అంటాడు, ధైర్యం అంటాడు. అన్నీ చెబుతాడు కానీ చివరికి మళ్లీ చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటాడు. ఈ దేశంలో అత్యంత అవినీతిపరుడు, పేద ప్రజలను మోసం చేసింది ఎవరైనా ఉంటే అది చంద్రబాబే. అలాంటి వ్యక్తికి పవన్ కల్యాణ్ మద్దతు తెలపాల్సిన అవసరం ఏముంది?" అన్నారు సిద్ధార్థ్ రెడ్డి 

Byreddy Siddharth Reddy
BRS
Jagan
Telangana
Pawan Kalyan
Chandrababu
YSRCP
Janasena
TDP
  • Loading...

More Telugu News